హైదరాబాద్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచారనే ఆరోపణల్లో రాజాసింగ్ ను అదుపులోనికి తీసుకున్నారు సౌత్ జోన్ పోలీసులు. యూట్యూబ్ లో నిన్న రాజా సింగ్ పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి దారితీసింది. అందులో మహ్మద్ ప్రవక్తను కించపరిచారంటూ అర్ధరాత్రి తర్వాత పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఓల్డ్ సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ల దగ్గర భైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఎంఐఎం కార్యకర్తల ఫిర్యాదుతో డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజా సింగ్ పై కేస్ నమోదైంది. ఈ కేసులోనే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
ఎంఐఎం ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు రాజాసింగ్ వివాదాస్పద వీడియోని యూట్యూబ్ తొలగించింది. తన వీడియోపై వస్తున్న వివాదంపై స్పందించారు రాజాసింగ్. తాను ఎవరిని కించపరచలేదని, మునావర్ ఫారూఖీ షోకి అనుమతి ఇస్తే వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తానని ముందే చెప్పానని స్పష్టం చేశారు. ధర్మం కోసం తాను చావడానికైనా సిద్దమన్నారు. తాను చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారని, శ్రీరాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుతో హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం