Saturday, January 18, 2025
HomeTrending Newsభూఅక్రమాలపై కాంగ్రెస్ ఫైర్

భూఅక్రమాలపై కాంగ్రెస్ ఫైర్

ప్రభుత్వ ఆస్తులను ఎలాంటి ప్రకటనలు లేకుండా దొంగచాటుగా అమ్మివేయడం హేయమైన చర్యని మాజీ మంత్రి,  ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం  పూడూర్ లోని ఖాదీ భాండార్ 57 గుంటల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ పై  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సామాన్యుడు లేఖ రాస్తే “ఈటెల” పైన చర్య తీసుకున్న సీఎం కేసీఆర్ ఖాదీ బండార్ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చెయ్యమని ఎమ్మెల్సీగా లేఖ రాసినా స్పందించడం లేదని ఆరోపించారు. మెటుపల్లి ఖాదీ భండార్ చైర్మన్ , కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఆస్తిని ఎలాంటి ప్రకటనలు లేకుండా అమ్మడం హేయమైన చర్య అని, కేంద్ర ప్రభుత్వ ఆస్తిని అమ్మే అధికారం ఎవ్వరికీ లేదని హెచ్చరించారు.

రు.12కోట్లు విలువ చేసే భూమిని దొంగచాటుగా కేవలం కోటీ25 లక్షలకే అమ్ముకున్నారని, తక్షణమే రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఈ స్థలాన్ని నేత కార్మికులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని, ఈ లావాదేవీల్లో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే, కొడిమ్యాల ఎంపీపీ, సింగిల్ విండో ఛైర్మెన్ అందరూ టీఆరెస్ వాళ్లేనని, టెక్స్టైల్ శాఖ మంత్రి KTR  ఒక్క సిరిసిల్లాకే మంత్రా…?  రాష్ట్రానికి మంత్రా? అని  జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్న ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చొప్పదండి ఇంచార్జ్ మేడిపల్లి సత్యం, కోరుట్ల ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు చిలువేరి నారాయణ, దారం అదిరెడ్డి, పిడుగు ప్రభాకర్ రెడ్డి, కడారి మల్లేశం , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్