బీఆర్‌ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు మరోసారి చూపించారని వ్యాఖ్యానించారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఆమె సూచించారు. తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించుకున్నామని అన్నారు. బోధన్‌లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. బోధన్‌లో 152 చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను కూడా తీసుకొస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని సైతం ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.