Saturday, January 18, 2025
HomeTrending Newsఎమ్మెల్సీ కవితకు దెబ్బ మీద దెబ్బ

ఎమ్మెల్సీ కవితకు దెబ్బ మీద దెబ్బ

లిక్కర్ కుంభకోణం ఆరోపణల్లో ఈడి అధికారులు దూకుడు పెంచారు. ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సాయంత్రం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఎమ్మెల్సీ నివాసంలో ఈడి, ఐటి సోదాలు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై అధికారులు వివరాలు సేకక్రిరించారు. నలుగు బృందాలుగా తనిఖీలు నిర్వహించారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు… ఇటీవల ఆమె చేపట్టిన కార్యక్రమాలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పార్టీ ఓటమి తర్వాత ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఒకటి రెండు సందర్భాల్లో సమీక్షల్లో పాల్గొనటం మినహా పార్టీ నేతలతో దూరంగా ఉంటున్నారు.

నిజామాబాద్ ఎంపి అభ్యర్థిగా కవితకు పార్టీ తరపున అవకాశం దక్కలేదు. ప్రస్తుత తరుణంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను ఎదుర్కోవటం బీఆర్ఎస్ లో కేవలం కవితకే సాధ్యమనుకున్నా పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ కు అవకాశం ఇచ్చారు. ధర్మపురి అరవింద్ ఒంటెత్తు పోకడలతో కమలం శ్రేణుల్లో అసంతృప్తి నెలకొందని… ఆయనను నిలువరించటం కవితకే సాధ్యమని పార్టీకి నివేదికలు అందినా అధినేత నిర్ణయం నేతలను విస్మయపరిచింది.

మొన్నటి ఎన్నికలకు ముందు నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలో అన్నీ తానై కవిత వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు చొరవ తీసుకున్నారు. ఎన్నికల సమయంలో వచ్చిన విభేదాలతో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో విబేదాలు పొడసూపాయని అంటున్నారు. పార్టీ తరపున గెలిచిన ముగ్గురిలో ఇద్దరితో విభేదాలు రావటం… లిక్కర్ కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని వినికిడి.

ఎన్నికల సమయంలో కవిత అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుండా… కేటిఆర్ సూచించిన వారికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం. కోరుట్ల సంజయ్..కేటిఆర్ మంచి మిత్రులు కావటంతో అక్కడ కవిత మాట మొదటి నుంచి చెల్లుబాటు కాలేదు. జగిత్యాలలో కవిత అనుచరుల జోక్యం మితిమీరటం సహించలేకపోయిన సంజయ్ కుమార్ వారిని దూరం పెట్టారు. హైదరాబాద్ వెళ్ళినా కేటిఆర్ ను కలుస్తున్న సంజయ్ కుమార్ కొద్దిరోజులుగా ఎమ్మెల్సీని కలవటం లేదని తెలిసింది.

బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ గా వ్యవహరించిన కవిత అక్కడ పార్టీ ఓటమితో నిరాశ చెందారని అనుచరవర్గంలో చెప్పుకుంటున్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అక్రమాలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చాయి. జీవన్ రెడ్డి అక్రమాలపై కవితకు ఫిర్యాదులు అందినా పట్టనట్టే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నేతలతో కొంత సఖ్యత ఉన్నా ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు.

అధికారంలో ఉన్నపుడు చేయకుండా.. జ్యోతిరావు ఫూలే విగ్రహం శాసనసభలో ఏర్పాటు చేయాలని కార్యక్రమం చేసి విమర్శల పాలయ్యారు. కొద్దిరోజులుగా తెలంగాణ, ఆంధ్ర, అస్సాంలలో గుళ్ళు గోపురాలు సందర్శిస్తున్నారు. మద్యం ఆరోపణల నుంచి గట్టేక్కేందుకు ప్రతఎంకంగా పూజలు చేశారని అప్పట్లో చెప్పుకున్నారు.

నిజామాబాద్ ఎంపి టికెట్ దక్కక, మద్యం ఆరోపణలతో అరెస్టు ఇలా కవితకు రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ తగిలినట్టయింది. లోక్ సభ ఎన్నికల సమయంలో.. లేదంటే ఎన్నికల తర్వాత కవితను అరెస్టు చేస్తారని జరిగిన ప్రచారం నిజమైంది.

ఈ నేపథ్యంలో కవిత భవితవ్యం ఏమిటి అనే అంశాలపై గులాబీ నేతలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. కవిత అరెస్టు, కాళేశ్వరంపై విచారణ, ఫార్ముల వన్  రేస్ అక్రమాలు, పోలీసు అధికారి ప్రనీత్ రావు లీలలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను మసక బారే విధంగా చేస్తున్నాయని అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్