మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించింది.
జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతివ్వడంతో వారు కవితను కలిశారు.
మరోవైపు కవితను విచారించాలని సిబిఐ వేసిన పిటిషన్ పై ఎల్లుండి విచారణ జరగనుంది. ఢిల్లీలో మద్యం పాలసీ లైసెన్సుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలకు రూ.100 కోట్లు చెల్లించినట్లు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో ఆమె నివాసంపై ఈడి, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత మార్చి 15 సాయంత్రం కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.
-దేశవేని భాస్కర్