Natural Deaths: జంగారెడ్డిగూడెంలో జరిగిన సహజ మరణాలపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు. ఈ మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కావని స్పష్టం చేశారు. మరణాల్లో కొన్ని వయసు రీత్యా, వివిధ అనారోగ్య సమస్యలు, ప్రమాదాల వల్ల జరుతుతుంటాయన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరించి వాటిని కూడా రాజకీయం చేసే అన్యాయమైన పరిస్థితిని ఇక్కడే చూస్తున్నామన్నారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై నేటి ఉదయం నుంచి టిడిపి సభ్యులు శాసన సభ కార్యకలాపాలను ఆడ్డుకున్నారు. సభ అదుపులోకి రాకపోవడంతో ఐదుగురు టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, డోలా బాల వీరాంజనేయులులను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం గూడెం ఘటనపై డిప్యూటీ సిఎం ఆళ్ళ నాని మాట్లాడారు. ఆ తర్వాత సిఎం జగన్ కూడాఈ విషయమై మాట్లాడారు.
కల్తీ, అక్రమ మద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. మద్యం వినియోగాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ అభిమతమని సిఎం పునరుద్ఘాటించారు. తాము అధికారంలోకి రాగానే 43 వేల బెల్టు షాపులను పూర్తిగా ఎత్తివేశామని, గతంలో ఈ బెల్టు షాపులకు పర్మిట్ రూమ్ సౌకర్యం కూడా ఇచ్చారని చెప్పారు. గతంలో మద్యం విచ్చలవిడిగా, ఎప్పుడు బడితే అప్పుడు లభించేదని, కానీ ఇప్పుడు సమయం నిర్దేశించి అమ్మిస్తున్నామని, పరిమిత సమయంలోనే లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
మద్యం అందుబాటులో లేకుండా చేయడం కోసమే తాము లిక్కర్ రేట్లు పెంచామని అయితే దీనివల్ల అక్రమ సారా వ్యాప్తి చేడుతోందని అధికారులు, స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ అధికారులు ఇచ్చిన సూచన తో పాటు తెలుగుదేశం డిమాండ్ ప్రకారం కూడా తాము మళ్ళీ రేట్లు తగ్గించామని సిఎం సభకు వివరించారు. కల్తీ మద్యం తయారు చేసేవారిని ఎప్పటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టమైన ఆదేశాలిచామన్నారు. అక్రమ కేసులపై ఎస్ ఈ బీ 13 వేల కేసులు నమోదు చేసిందన్నారు.