Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆకాశమంతా అలుముకున్న అనురాగం .. అమ్మ (మదర్స్ డే స్పెషల్)

ఆకాశమంతా అలుముకున్న అనురాగం .. అమ్మ (మదర్స్ డే స్పెషల్)

‘అమ్మ’ .. చూడటానికీ  .. పలకడానికి ఇవి రెండు అక్షరాలే. కానీ ఆ అక్షరాల వెనుక ఆకాశమంత ప్రేమ … అవని అంతటి ఓర్పు దాగి ఉన్నాయి. ఎవరికీ ఏ బాధ కలిగినా ‘అమ్మ’ అనే మాటనే తొలి ఔషధం. ఎందుకంటే బాధ కలిగిన వెంటనే ఎవరైనా ‘అమ్మా’ అనే అంటారు.

అమ్మ ఎక్కడ ఉన్నా ఆ మాటతోనే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

అమ్మ ఆశీస్సులతో కోలుకుంటామనే ధైర్యం గుండె గూటిలో దీపమై వెలుగుతుంది.

అమ్మలేనివాడికే అమ్మ విలువ తెలుస్తుంది.

అమ్మ ఉన్నవాడు అదృష్టవంతుడు ..

అమ్మ ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు..

అమ్మ ప్రేమ ముందు అనంతమైన ఆకాశం అంగుళమై కనిపిస్తుంది.

అమ్మ చల్లని చూపు ముందు వేయి పున్నమిల  వెన్నెల కూడా వెల వెల బోతుంది.

పసితనంలో అమ్మకంటే గొప్పగా ఏదీ కనిపించదు .. అమ్మ పాట కంటే తీయగా ఏదీ అనిపించదు.

దేవతలు కరుణించాలంటే స్తోత్రాలు .. పారాయణాలు చేయాలి. ఉపవాసాలు .. ఉద్యాపనలు చేయాలి. కానీ అమ్మ పలకాలంటే ఒక్క పిలుపు చాలు. ఆ పిలుపు పూర్తికాకముందే అమ్మ వచ్చేస్తుంది. అలాంటప్పుడు అన్నిటికంటే శక్తిమంతమైన మంత్రం ‘అమ్మ’కాక మరేముంటుంది? మహిమలెరుగని దేవత అమ్మకాక మరెవరుంటారు?

అమ్మ ఒడి ఒక ప్రేమ ప్రపంచం .. అమ్మ మనసు మంచినీటి సముద్రం. ఏ అమ్మ అయినా తన ప్రాణాలను తన బిడ్డల్లోనే దాచేస్తుంది. దీపం తన చుట్టూ ఎలా అయితే చీకటిని చేరనీయదో .. అలాగే అమ్మ కూడా తన బిడ్డల దరిదాపుల్లోకి కష్టనష్టాలు రానీయదు. ఏ భయాలు తన బిడ్డలను చుట్టుముట్టనీయకుండా చూసే ఆయుధాలు ధరించని ఆదిపరాశక్తి అమ్మనే కదా!. తన ఆనందం .. తన ఆవేశం .. తన ఆవేదన వీటన్నింటినీ మూటగట్టేసి అటకపై పెట్టేసేది తన బిడ్డల కోసమే కదా!!

అమ్మ తన బిడ్డలను నిద్రపుచ్చడానికి పాటలు పాడుతుంది .. వాళ్లలో చైతన్య శక్తిని మేల్కొలిపే గురువుగా మంచి మాటలు చెబుతుంది. జీవితమనే ప్రయాణంలో అడుగులు ఎంత జాగ్రత్తగా వేయాలని చెప్పే మార్గదర్శిగా నిలుస్తుంది. మహా వీరుల కథలు చెప్పి ధైర్యాన్ని నూరిపోస్తుంది. భక్తుల కథలు చెప్పి భగవంతుడిపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆశయం లేని జీవితానికి అర్థం లేదనీ .. నిరాశకు విజయాన్ని మించిన విరుగుడు లేదని ఉపదేశిస్తుంది. నిజంగా దేవతలు అమాయకులు. అందుకే అమ్మని మనకు వదిలేసి అమృతం పట్టుకెళ్లారు. అమ్మలేని అమృతం ఎందుకు? అమ్మలేని అమరత్వమెందుకు?

ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటింటా వెలసిన శక్తిపీఠం అమ్మ! అనునిత్యం పఠించవలసిన ప్రేమ పాఠం అమ్మ!! తన బిడ్డల  నుంచి అమ్మ ప్రశంసలను ఆశించదు .. ఖరీదైన కానుకలను కోరుకోదు. అమ్మ కోరుకునేది ఒక్కటే, తాను ఆశపడినట్టుగా  తన బిడ్డలు గెలవడం .. తాను ఆశించిన స్థాయిలో వాళ్లు నిలవడం. అలాంటి అమ్మ మనసును నొప్పించకుండా నడచుకునే బిడ్డలు ఉత్తములు. ఆ తల్లి కళ్లలో కన్నీళ్లు కాకుండా ఆనంద బాష్పాలకు కారకులయ్యే బిడ్డలు ధన్యులు. అమ్మ కలలు నిజం చేయడమే .. అమ్మ ముచ్చట తీర్చడమే, ‘మదర్స్ డే’ సందర్భంగా బిడ్డలు అందించే అసలు సిసలైన కానుక.

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్