తెలంగాణా పిసిసి అధ్యక్ష పదవి రేసులో చివరికంటూ నిలిచిన ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అసంతృప్తిని, అసహనాన్ని వెళ్ళగక్కారు. రేవంత్ రెడ్డి కి బాధ్యతలు కట్టబెట్టడంతో కోమటిరెడ్డి అలిగారు. తాను ఇకపై గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. తనను కొత్త అధ్యక్షుడు కానీ, కారక్యర్తలు కానీ ఎవరూ కలవొద్దని సూచించారు.
ఓటుకు నోటు మాదిరిగా…నోటుకు పిసిసి పదవిని పార్టీ ఇన్ ఛార్జ్ అమ్ముకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. త్వరలోనే ఆధారాలు బైటపెడతానని ప్రకటించారు. ఇది తెలంగాణా పిసిసి కాకుండా టిడిపి పిసిసిగా మారిందని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి వచ్చినవారికే అధ్యక్ష పదవి దక్కుతుందని అనుకున్నానని, నేను కార్యకర్త స్థాయి నుంచే ఎదిగానని, కానీ ఈ నియామకం ద్వారా కార్యకర్తలకు న్యాయం జరగదని చెప్పినట్లు అయ్యిందని కోమటిరెడ్డి వాపోయారు. ఇకపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ లాగే మారుతుందని అయన జోస్యం చెపారు. కొత్త నాయకత్వంలో హుజురాబాద్లో కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలని సూచించారు.
తన రాజకీయ భవిష్యత్ కార్యకర్తలే నిర్ణయిస్తారని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపైన, రాహుల్ గాంధీ పైన విమర్శలు చేయబోనని కోమటిరెడ్డి వివరించారు.
ఇకపై ప్రజల్లోనే ఉండి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని, నల్గొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని, ఇబ్రహింపట్నం నుండి భువనగిరి వరకూ పాదయాత్రను రేపట్నుంచి ప్రారంభిస్తానని కోమటిరెడ్డి చెప్పారు.