Saturday, November 23, 2024
HomeTrending NewsMulugu : ములుగు వెలుగు రేఖ ఎవరు?

Mulugu : ములుగు వెలుగు రేఖ ఎవరు?

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ములుగు స్థానానికి ప్రత్యేకత ఉంది. రెండు ప్రధాన పార్టీల నుంచి మావోయిస్టు నేపథ్యం ఉన్న అభ్యర్థులే తలపడటం…ఇద్దరు ఆదివాసీలు…మహిళలే కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ వన దేవతలా జాతర ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది.

ములుగు నియోజకవర్గంలో 2,03,958 మంది ఓటర్లు ఉన్నారు. ములుగు నియోజకవర్గంలో ములుగు, గోవిందరావు పేట, వెంకటపూర్, తాడ్వాయి, మంగపేట, కొత్తగూడ, ఏటూరునాగారం మండలాలు ఉన్నాయి.

ST నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులు ఉన్నత విద్యావంతులు కావటం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క రాజనీతి శాస్త్రంలో పీ.హెచ్.డి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి బీకాం,బీఈడి చేయగా బిజెపి అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ MBBS చేసి వైద్య వృత్తిలో ఉన్నారు.

2009లో టిడిపి నుంచి గెలిచిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క 2014లో మూడో స్థానంలోకి పడిపోయారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. 2018లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కరోనా సమయంలో మారుమూల గ్రామాలకు వెళ్లి నిత్యావసర సరుకులు ఇవ్వటం, కరోనా బాధితులకు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డికి కుడిభుజంగా చెప్పుకునే సీతక్క పరుష పదజాలం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయటం…ప్రజా సమస్యల మీద స్పందించటం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సీతక్కకు మంత్రి పదవి ఖాయమని, పిలిస్తే పలికే సీతక్క గెలుపు ఎంతో అవసరమని హస్తం నేతలు ఓటర్లకు వివరిస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి శాసనసభ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్క దంపతుల కుమార్తె బడే నాగజ్యోతి. ఆమె ఆ తరువాత తాడ్వాయి జెడ్పీటీసీగా ఎన్నికై జడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా భాధ్యతలు చేప్పట్టి.. 2023లో జడ్పీ చైర్మన్‌గా ఉన్న కుసుమ జగదీశ్ మరణంతో ఇంచార్జ్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది.

కుటుంబ నేపథ్యం, పల్లెపల్లెకూ విస్తరించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు.. ఓ తండ్రిలా దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్‌కు ములుగు ఘన విజయాన్ని కానుకగా అందిస్తాను’ అంటున్నారు నాగజ్యోతి.

బిజెపి నుంచి ఆజ్మీర ప్రహ్లాద్ నాయక్ పోటీచేస్తున్నారు. మాజీ మంత్రి చందూలాల్ తనయుడైన ప్రహ్లాద్ బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవటంతో బిజెపిలోకి జంప్ చేసి కమలం గుర్తుతో ప్రజల్లోకి వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మ, ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజికవర్గం కావటం తన గెలుపునకు దోహదం చేస్తుందని భరోసాతో ఉన్నారు.

బీఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు ఇద్దరు కొత్త వారు, గతంలో ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారు కనుక వారి మధ్య ఓట్ల చీలిక కాంగ్రెస్ అభ్యర్థికి అనుకులించే అంశం. నిరుద్యోగం, ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన అంశాలుగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం సాగిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్