Sunday, January 19, 2025
HomeTrending Newsడబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం

దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ అంబేడ్కర్ నగర్ లో 28.50 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ లతో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ముందుగా స్థానిక మహిళలు బోనాలు, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి అల్పాహారం చేశారు.

ఈ కార్యక్రమంలో MLC సురభి వాణిదేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి, కార్పొరేటర్ లు పాల్గొన్నారు.  అనంతరం ఏర్పాటు చేసిన సభలో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడుతూ దేశంలోని ఏ మెట్రో పాలిటన్ నగరాలలో లేని విధంగా హైదరాబాద్ లో మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరుగుతుందని, ఈ ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేనని అన్నారు. అంబేడ్కర్ నగర్ వాసులు కూడా ఎన్నడూ ఊహించని విధంగా అద్బుతమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చిందని అన్నారు.

హుస్సేన్ సాగర్ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ఇండ్లను చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. లబ్దిదారులు కూడా తమ ఇండ్ల తో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇండ్లతో పాటు 26 షాప్ లను నిర్మించడం జరిగిందని, ఈ షాప్ ల ద్వారా వచ్చే ఆద్దెలతో భవనాలు, లిఫ్ట్ ల నిర్వహణ చేసుకోవాలని సూచించారు. ఒక సంక్షేమ కమిటీ ని ఏర్పాటు చేసుకొని కాలనీ ని మోడల్ కాలనీగా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.

ఇల్లు కట్టడం….పెళ్ళి చేయడం ఎంతో కష్టమని మన పెద్దలు చెబుతుంటారని, కానీ మన ముఖ్యమంత్రి పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా నిర్మిస్తున్నారని, ఆడపడుచుల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ పేదలకు అండగా నిలిచారని చెప్పారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో మంచి మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి KCR అన్నారు.

IDH కాలనీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్ళే సమయంలో అంబేడ్కర్ నగర్ లోని పూరి గుడిసెలలో నివసిస్తున్న పేద ప్రజల జీవన స్థితి ని చూసి ఎంతో చలించి పోయారని అన్నారు. ఈ పూరి గుడిసెల స్థానంలో అన్ని సౌకర్యాలతో విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, నేడు ఆ హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ స్థానిక మ‌హిళ‌లు బోనాల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత మంత్రి కేటీఆర్ ఆడ‌బిడ్డ‌ల‌తో క‌లిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల‌తో మాట్లాడిన కేటీఆర్.. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా ఉంద‌ని అడిగారు. వారి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. మురికివాడ‌ల్లో ఉన్న త‌మ‌కు అద్భుత‌మైన ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని ల‌బ్దిదారులైన మ‌హిళ‌లు కేటీఆర్‌కు చెప్పి.. కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్