టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం ధర్నా నిర్వహించారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నో ప్రలోభాలు పెట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. బీజేపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించి తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని నిరూపించాలన్నారు. హిందుత్వ పేరుతో హిందూ మత గౌరవాలను, విశ్వాసాలను బీజేపీ మట్టగలినే ప్రయత్నాలు చేస్తుందిని దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా సీయం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సమాజం వాటిని తిప్పికొడుతుందని వెల్లడించారు. 14 ఏండ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్రంలో సీయం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకున్నారని, మిగితా రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ బీజేపీ ఆకర్ష్ పని చేయదని, రానున్న రోజుల్లో కమలం పువ్వు వాడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.