బిజెపి మూడో లిస్టులో ఢిల్లీ నాయకత్వం మార్కు కనిపించినా తెరవెనుక కుట్రలు జరిగాయని వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో సీట్ల కేటాయింపు చర్చనీయంశంగా మారింది. పార్టీకి మంచి పట్టు ఉన్న రాజధానిలో గెలిచేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటనలో కొంత మార్పులు చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముషీరాబాద్ నియోజకవర్గంలో కమల దళం పటిష్టంగా ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి మొదటి నుంచి ఆసక్తి చూపుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిర్మొహమాటంగా ఇదే విషయం చెప్పారు. ఆమెకు దక్కుతుందని అందరు భావించారు.
అనూహ్యంగా OBC మోర్చా జాతీయ కార్యదర్శి పూస రాజును రంగంలోకి దించారు. విజయలక్ష్మికి ఇవ్వకపోయేందుకు లోగొట్టు వేరే ఉందంటున్నారు. లక్ష్మణ్ ఏకైక కుమారుడు రాహుల్ కోసం ఈ ఎత్తుగడ వేసినట్టు, వచ్చే ఎన్నికల్లో రాహుల్ కోసం రిజర్వు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. విజయలక్ష్మికి ఇస్తే ముషీరాబాద్ లో పాతుకుపోతారని ఎంపి కే లక్ష్మణ్ ఆందోళన చెందారని…దత్తాత్రేయకు చెక్ పెట్టేందుకే లక్ష్మణ్ కు దగ్గరి నేతగా పేరున్న రాజును రంగంలోకి దించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తీవ్ర అసంతృప్తికి లోనైన విజయలక్ష్మి పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నేతలు కూడా సంప్రదించారని, పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
బిజెపి నుంచి పూస రాజు, బీఆర్ఎస్ నుంచి ముఠా గోపాల్ ఇద్దరు గంగపుత్ర సామాజికవర్గానికి చెందినవారు. బిజెపి నుంచి అంబర్ పేట నియోజకవర్గం కేటాయించమని కోరితే ముషీరాబాద్ ఇచ్చారని ఆ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాజు తండ్రి పూస స్వామి కాంగ్రెస్ లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో పూస స్వామికి పేరుంది.
ఇద్దరు ఒక వర్గానికి చెందినవారు కావటంతో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ లబ్ది పొందవచ్చనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ముషీరాబాద్ లో ఎవరు బరిలోకి దిగినా బిజెపిదే గెలుపని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పటిష్టమైన పార్టీ శ్రేణులు, బలమైన ద్వేతీయ శ్రేణి నాయకత్వంకు తోడు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భరోసాతో ఉన్నారు.
-దేశవేని భాస్కర్