Sunday, September 8, 2024
HomeTrending Newsషర్మిల వెంట నడుస్తా: ఆర్కే సంచలన ప్రకటన

షర్మిల వెంట నడుస్తా: ఆర్కే సంచలన ప్రకటన

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు చేపడతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను వైఎస్సార్ కుటుంబానికి చెందినా వ్యక్తినని, షర్మిల వెంట నడుస్తానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానని వెల్లడించారు. ఇటీవలే తాను షర్మిలను కలిశానని తెలిపారు.

వైసీపీకి నేను ఎంత సేవ చేశానో తనకు తెలుసని, సర్వస్వం పోగొట్టుకున్నానని వ్యాఖ్యానించారు. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలని, ప్రత్యర్థులను ఒడించాలంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలని, మంగళగిరి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారని నిర్వేదం వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానని, కానీ  మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని, కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తీసుకువస్తే సీఎంవోకు వెళ్లి పదే పదే అడిగానని పేర్కొన్నారు.

తానే స్వయంగా 8 కోట్ల రూపాయల వరకు బైట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానన్నారు. సొంత డబ్బుతో mtmc, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశానని, లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీనికి తాను ఎవరినీ నిందించడం లేదన్నారు,

త్వరలోనే నిధులు మంజూరు చేస్తామంటూ సిఎంవో నుంచి ధనుంజయ రెడ్డి తనకు చాలా సార్లు మేసేజీలు పెట్టారని కానీ అది కార్యరూపం దాల్చలేదన్నారు.  ఎన్నికలు దగ్గరకు వచ్చాయని, ఎప్పుడు నిధులు ఇంకెప్పుడు మంజూరు చేస్తారని… అందుకే రాజీనామా చేశానని, ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టంమని అన్నారు.

మంగళగిరి ప్రజలకు నేను దూరంగా ఉండనని, ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.  ఉంటే వైసీపీలో ఉంటానని గతంలో చెప్పిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు వైసీపీ వీడానని, ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పా కాబట్టి దీనిపై సిఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.  ఇతర పార్టీలనుంచి తనకు ఆహ్వానాలు అందాయని, కానీ వైఎస్ కుటుంబంతో ఉన్నాను, ఉంటానని వారితో చెప్పానన్నారు,

చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం కొనసాగుతుందని, ఓటుకు నోటు కేసులో కూడా తన పోరాటం ఆపబోనని, రేవంత్ సిఎం అయినా, షర్మిల కాంగ్రెస్ లో చేరినా ఇది ఆపే ప్రసక్తే లేదన్నారు,.  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పారు. తప్పు ఎవ్వరూ చేసినా తప్పేనని, వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడబోనన్నారు.  తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయ స్థానాలు తెలుస్తాయన్నారు.

నేను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదని,  టికెట్ ఇవ్వనందుకు తాను పార్టీని వీడలేదని వివరణ ఇచ్చారు. తనకు, చిరంజీవికి, జగన్ కు మధ్య ఏమి జరిగింది అనేది మాకు మాత్రమే తెలుసన్నారు. తిరిగి వైఎస్సార్ సీపీ లోకి వెళ్లే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్