ఎన్నికల తరువాత విశాఖనగరం ఏపీ రాజధానిగా ఉంటుందని, తన ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ విశాఖ సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని, అమరావతిలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉందని, రాబోయే 1౦-15 ఏళ్ళలో అది 20 లక్షల కోట్ల వరకూ వెళ్తుందని.. అన్ని నిధులు పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ గా తయారు చేస్తామని, ఈ నగరం ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం తపపనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడంలో తన వ్యక్తిగత స్వార్ధం ఏమీ లేదన్నారు. విశాఖలో కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఈ నగరంపై పదేళ్ళ అభివృద్ధి ప్రణాళిక తమ ప్రభుత్వం వద్ద ఉందని, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందని, అమరావతి సహా ఏ ప్రాంతం పట్లా తనకు వ్యతిరేకత ఏమీ లేదని తేల్చి చెప్పారు. న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుందన్నారు. విశాఖ దేశంలోనే ఓ అత్యుత్తమ నగరంగా ఉంటుందని సిఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.