ఈ సారి సంక్రాంతి సందడి ఒక రేంజ్ లో ఉండనుందనే విషయం ఆడియన్స్ కి అర్థమైపోయింది. సంక్రాంతి కానుకగా ఈ సారి 5 సినిమాలు థియేటర్లకు రానున్నాయి. ఆ జాబితాలో ‘హను మాన్’ .. ‘గుంటూరు కారం’ .. ‘సైంధవ్’ .. ‘ఈగల్’ .. ‘ నా సామిరంగ’ కనిపిస్తున్నాయి. ఈ ఐదు సినిమాల్లో ‘గుంటూరు కారం’ .. ‘హను మాన్’ సినిమాలు ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానున్నాయి. మహేశ్ బాబు సినిమాపై అంచనాలు ఉంటే, ‘హను మాన్’ పై అందరిలో ఆసక్తి ఉంది.
ఇక 13వ తేదీన వెంకటేశ్ ‘సైంధవ్’ .. రవితేజ ‘ఈగల్’ బరిలోకి దిగుతున్నాయి. వెంకటేశ్ కి ఇది 75వ సినిమా కావడం వలన, అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఈగల్’ మేకర్స్ కూడా తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. ఆ తరువాత రోజైన 14వ తేదీన రావడానికి ‘నా సామిరంగ’ ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నాడు. సంక్రాంతి పండుగకి సంబంధించిన కంటెంట్ కావడం వలన, నాగార్జున ఈ సినిమాపై బలమైన నమ్మకంతో ఉన్నాడు.
సంక్రాంతి బరిలో దిగే సినిమాల్లో బడ్జెట్ పరంగా చూసుకుంటే ‘హను మాన్’ చిన్న సినిమానే. అందువలన పండుగ బరిలో నుంచి ఈ సినిమా తప్పుకుంటుందని చాలామంది అనుకున్నారు. ‘బడ్జెట్ పరంగా కాదు .. కంటెంట్ పరంగా చూడండి’ అంటూ వారు అదే డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఇక ‘నా సామిరంగ’ షూటింగ్ పూర్తి కానందున ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమేననే టాక్ వినిపించింది. అలాంటి డౌట్ అస్సలు పెట్టుకోవద్దంటూ నాగార్జున 14వ తేదీని ఎనౌన్స్ చేశాడు. మొత్తానికి ఈ సారి సంక్రాంతి సందడి థియేటర్ల దగ్గర గట్టిగానే కనిపిస్తుందన్న మాట.