Saturday, January 18, 2025
Homeసినిమా'కల్కి' కథకు ఐదేళ్లు పట్టిందట!

‘కల్కి’ కథకు ఐదేళ్లు పట్టిందట!

ప్రభాస్ హీరోగా రూపొందిన ‘కల్కి’ సినిమా త్వరలో థియేటర్లలో దిగిపోవడానికి రెడీ అవుతోంది. వైజయంతీ బ్యానర్ పై నిర్మితమైన భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ స్థాయి బడ్జెట్ తో వారు నిర్మించిన మొదటి సినిమా ఇదే. పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వివిధ భాషలకి చెందిన సీనియర్ స్టార్స్ ఈ సినిమాలో కనిపించనున్నారు. దాంతో ఈ సినిమా కోసం అంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అశ్వద్ధామను పోలిన పాత్రలో అమితాబ్ .. అర్జునుడిని పోలిన పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడనే విషయం తెలిసిన దగ్గర నుంచి, అసలు కథ ఎలా ఉండనుందనేది అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది. తాజా ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, మొదటి నుంచి కూడా తనకి సోషియో ఫాంటసీ కథలంటే ఇష్టమనీ, ఆ ఇష్టమే తనని ఇంతవరకూ తీసుకొచ్చిందని చెప్పాడు. ఈ జోనర్ టచ్ చేసే ఆలోచనతోనే ముందుకుసాగుతూ వచ్చానని అన్నాడు.

‘స్టార్ వార్స్’ తరహాలో తెలుగు సినిమాను ఎలా చేయాలనే ఒక ఆలోచనతో ఈ కథను మొదలుపెట్టానని  చెప్పాడు. అలా ఈ కథను పూర్తి చేయడానికి ఐదేళ్లు పట్టిందని అన్నాడు. ప్రతి యుగంలోను రాక్షసులు పుట్టుకు రావడం .. వారిని అంతం చేయడానికి భగవంతుడు అవతరించడం జరుగుతూ వచ్చిందని చెప్పాడు. అలాగే కలియుగం అంతంలో ‘కల్కి’ పుట్టుకొస్తాడనీ, దానికి ముందు ఏం జరుగుతుందనే ఈ సినిమా కథ అని అన్నాడు. అటు పురాణాలను .. ఇటు సైన్స్ ను కలుపుతూ, తెరపై నాగ్ అశ్విన్ ఎలాంటి అద్భుతాలు చేయనున్నాడనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్