రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు మెహర్ రమేష్, బాబీ, బుచ్చిబాబు సానా, దిల్ రాజు, మైత్రీ నిర్మాత నవీన్, సాయి ధరమ్ తేజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులు విచ్చేశారు. నాగబాబు ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ ఈవెంట్‌లో నాగబాబు మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో మా ఐదుగురు బ్రదర్ అండ్ సిస్టర్‌లకు మొదటి కొడుకు రామ్ చరణ్. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా.. నాకు, పవన్ కళ్యాణ్‌కు, మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. ఇక మాకు చిరంజీవి గారు ఎలానో.. మా పిల్లలకు, మా చెల్లెలి పిల్లలకు, పవన్ కళ్యాణ్ పిల్లలకు రామ్ చరణ్ అలాంటి వాడు. వాళ్లకి ఏమైనా సమస్యలు వస్తే.. వాళ్లంతా ముందుంగా రామ్ చరణ్ వద్దకు వెళ్తారు. సలహాలు, సూచనలు తీసుకుంటారు. రామ్ చరణ్ ప్రస్తుతం పూర్తి మెచ్యూర్డ్ పర్సన్‌గా మారాడు. అదే నాకు చరణ్‌లో నచ్చిన విషయం.
ఒకప్పుడు కాస్త కోపం, ఆవేశంగా ఉండేవాడు కానీ.. ఇప్పుడు ఎంతో మెచ్యూర్డ్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మేజర్ పార్ట్ అవ్వడం, ఆస్కార్ వరకు వెళ్లడం, నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, ఆ స్టేజ్ మీద రామ్ చరణ్ బొమ్మ కనిపించడం మనందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తుంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా.. ‘ఆరెంజ్’ సినిమాను రీ రిలీజ్ చేశాను. దాని ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని అనుకున్నాను.
జనం కోసం తన జీవితాన్ని వదిలేసిన నాయకుడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే నాకు చేతనైన సాయాన్ని చేస్తున్నాను. ఆరెంజ్ సినిమా అప్పుడు రిలీజ్ చేస్తే యావరేజ్ అన్నారు. ఆర్థికంగా అప్పట్లో నష్టపోయాను. కానీ ఇప్పుడు అదే సినిమాను అందరూ బాగుందని అంటున్నారు. రెండ్రోజులుగా ఆరెంజ్ సినిమా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. అంటే ఒక తరం ముందే ఆ సినిమాను తీశామని అనిపిస్తుంది. అదే సినిమాను ఇప్పుడు తీసి ఉంటే హిట్ అయ్యేది. ఇక్కడ సీఎం సీఎం అని అరిస్తే కాదు.. దమ్ముంటే ఎన్నికల్లో పాల్గొని, జనాలను ఉత్తేజ పరిచి.. ఓట్లు వేయండి’ అని అన్నారు.
Also Read : Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా రామ్ చరణ్ స్టైలిష్ లుక్