ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సిరీస్ లలో ‘దూత’ ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. నాగచైతన్య ప్రధానమైన పాత్రగా ఈ సిరీస్ రూపొందింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ ఈ సిరీస్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండటం విశేషం. అందుకు కారణం విక్రమ్ కుమార్ టేకింగ్ .. ఆయన స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. ఈ సిరీస్ లో చైతూ, డబ్బు కోసం పక్కదారి పట్టిన ఒక జర్నలిస్టుగా కనిపిస్తాడు.
హీరో వృత్తి పరంగా .. వ్యక్తి గతంగా కూడా పక్కదారిలో వెళుతూ ఉంటాడు. అందువలన ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుంది? అనేదే కథ. అన్ని వ్యవహారాలను తాను చాలా తెలివిగా మేనేజ్ చేస్తూ వెళుతున్నానని అనుకుంటున్న అతనికి, ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. 1963 నుంచి ఒక అదృశ్య శక్తి అవినీతికి పాల్పడిన జర్నలిస్టుల కుటుంబాలను టార్గెట్ చేస్తూ వస్తోందనీ, అది తన వరకూ వచ్చిందని గ్రహిస్తాడు. ఆ శక్తి ఏమిటనేది తెలుసుకుంటూ ఎదురెళతాడు.
మొదటి నుంచి చివరివరకూ విక్రమ్ కుమార్ ఈ కథను నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ కథ అంతా కూడా వర్షంలోనే కొనసాగడం సన్నివేశాలను మరింత బలాన్ని ఇచ్చింది. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ‘ఆత్మ’ చుట్టూనే ఈ కథ తిరుగుతున్నప్పటికీ, ‘ఆత్మ’ను ఎక్కడా చూపించకుండా వెళ్లడం, ఈ సిరీస్ లోని విశేషాలతో ఒకటిగా కనిపిస్తుంది. అందుకే ‘దూత’ అందరినీ ఆకట్టుకుంటూ వెళుతోంది.