వేసవి కాలం, సూర్య తాపంతో పోలిస్తే నాగర్ కర్నూల్ ఎంపి ఎన్నికలు నల్లమల అడవుల్లో సెగ పుట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు, నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బిజెపి నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ తలపడుతున్నారు.
దీని పరిధిలో నాగర్ కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి, ఆలంపూర్, గద్వాల్, అచ్చంపేట్, కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గద్వాల, ఆలంపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 17 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లేదే పైచేయి. మహిళలు 8.73 లక్షల పైచిలుకు ఉండగా పురుషులు 8.64 లక్షల పైగా ఉన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండ రెడ్డిపల్లి నాగర్ కర్నూల్ పరిధిలోనే ఉంది.
సిట్టింగ్ ఎంపి పోతుగంటి రాములు బీఆర్ఎస్ నుంచి గెలిచి లోక్ సభ ఎన్నికల ముంగిట బిజెపిలో చేరి తన కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ కు టికెట్ ఇప్పించుకున్నారు. భరత్ రాకతో బిజెపి నేతలు అసంతృప్తి లోనయ్యారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న బంగారు శృతి ప్రచారంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రస్థాయి కమలం నేతలు బుజ్జగించటంతో ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో బిజెపి బలంగా ఉంది. ఇటీవల గ్రామ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలు విస్తరించాయి. మోడీ చరిష్మాతో బిజెపి ఓటింగ్ శాతం పెరిగి.. రాములుకు ఉన్న పరిచయాలు… ZPTCగా భరత్ ప్రసాద్ జనంలో ఉండటం కలిసివస్తుందని బిజెపి ధీమాగా ఉంది.
కాంగ్రెస్ నుంచి మల్లు రవి బరిలో ఉండగా ప్రచారం ఉదృతంగా నిర్వహిస్తున్నారు. 1991, 1998లో ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన మల్లు రవి ఈ దఫా గెలిచి సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ కోసం ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నుంచి పోటీ ఎదురైనా పెద్దల జోక్యంతో మల్లు రవికి దక్కింది.
ఎంపి సీటు కోసం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని కూడా వదులుకున్నారు. గతంలో తన అన్న మల్లు అనంతరాములు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం.. తను రెండుసార్లు గెలవటంతో మల్లు రవికి నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటం.. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణ రావు మద్దతుతో పాటు సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం ప్రత్యెక చొరవ తీసుకుంటున్నారు.
బీఎస్పి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఒకదశలో పోటీ చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ రావటం కొంత ఉరట అనే చెప్పుకోవాలి.
ఇటీవల పార్టీ అధినేత కెసిఆర్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. మరోవైపు స్వేరోస్ సహకారంతో ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, గువ్వల బాలరాజు కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, భరత్ ప్రసాద్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా మాజీ ఎంపీ మల్లు రవి మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం, సాయంత్రమే ప్రచారం సాగుతోంది. అభ్యర్థుల దర్శనం కన్నా ప్రచార వాహనాలే ఎక్కువగా గ్రామాల్లో తిరుగుతున్నాయి.
మొత్తం పార్లమెంట్ పరిధిలో 17లక్షలకు పైగా ఓటర్లు ఉంటే అందులో సుమారుగా 5లక్షలకు పైగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. మాదిగ ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో ఆ ఓటర్లలో సగానికిపైగా సాధించినా సునాయసంగా గెలవచ్చు అనే లెక్కల్లో అభ్యర్థులు ఉన్నారు.
-దేశవేని భాస్కర్