నాగార్జునకి మొదటి నుంచి రొమాంటిక్ హీరోగా పేరుంది. అక్కినేని నాగేశ్వరరావు తరువాత ఆయన వారసుడిగా … రొమాంటిక్ హీరోగా నాగార్జున ఆ ప్లేస్ ను ఆక్రమించారు. ముఖ్యంగా విలేజ్ నేపథ్యంలో ఆయన చూపించిన రొమాంటిక్ హీరోయిజాన్ని అభిమానులు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అందువల్లనే ఆయన మిగతా సినిమాలు పరాజయం పాలైనా, గ్రామీణ నేపథ్యంలోని కథలకు ప్రేక్షకులు పట్టం కడుతూ వస్తున్నారు.
అలా ఆ మధ్య వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ .. ‘బంగార్రాజు’ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలోకి దిగినవే. ఆ తరువాత నాగార్జున చేసిన యాక్షన్ సినిమాలు ఆయన అభిమానులను నిరాశపరిచాయి. దాంతో తనకి విలేజ్ నేపథ్యం .. సంక్రాంతి పండగ సందర్భం కలిసొస్తుందని భావించిన నాగార్జున, ఆ తరహా కథను ఎంచుకున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా విజయ్ బిన్నీని పరిచయం చేశారు.
ఈ కథ సంక్రాంతి పండుగకి సంబంధించి సాగుతుంది. అందువలన పండగకే ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్లారు. మూడు నెలల్లోనే అన్ని పనులు పూర్తిచేసి ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన థియేటర్లలో దిగబెట్టారు. ‘ఈ సినిమాతో బాక్సాఫీస్ కొడతాం’ అని ప్రీ రిలీజ్ ఈవెంటులో నాగార్జున బలంగా చెప్పారు. అన్నట్టుగానే వసూళ్ల దిశగా ఈ సినిమాను పరిగెత్తించారు .. లాభాల బాటలో పడేశారు. మొత్తానికి నాగార్జున అన్నమాట నిలబెట్టుకున్నారన్న మాట.