టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మరిచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి.. సీనియర్ హీరోల్లో 50 కోట్ల మార్క్ ను అందుకున్న తొలి హీరోగా నాగార్జునకు సరికొత్త రికార్డ్ ను అందించింది. ఈ మూవీకి ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కథ పై కసరత్తు జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు నాగార్జున.. కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జులైలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన కుదరలేదు.
తాజా సమాచారం ప్రకారం… ఈనెల 20 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కనిపించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌ని రూపొందిస్తున్నారు. ఇప్పుడా సెట్‌లోనే ముందుగా నాగార్జున, రమ్యకృష్ణల పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నుంచి నాగచైతన్య, కృతిశెట్టిల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.