Thursday, September 19, 2024
HomeTrending Newsకాంగ్రెస్ ఖిల్లా... నల్లగొండ మీద కన్నేసిన బిజెపి

కాంగ్రెస్ ఖిల్లా… నల్లగొండ మీద కన్నేసిన బిజెపి

నల్గొండ లోక్ సభ స్థానంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానా రెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బిజెపి తరపున శానంపూడి సైదిరెడ్డి తలపడుతున్నారు. పోలింగ్ కు మరో నెల రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ఉదృతం చేశారు.

నల్లగొండ లోకసభ నియోజకవర్గం పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నాగార్జున సాగర్, దేవరకొండ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. సూర్యాపేటలో బీఆర్ఎస్ గెలవగా మిగతా అన్ని స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. నియోజకవర్గంలో 15 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి నాగార్జున సాగర్ లో పట్టు ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి నల్లగొండ స్థానికుడు కాగా బిజెపి అభ్యర్థి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేగా సేవలు అందించారు.

రాజకీయంగా చైతన్యవంతమైన ఈ నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కమ్యూనిస్టులకు  కంచుకోటగా నిలిచింది. ఆ తర్వాత నుంచి హస్తం పార్టీకి పెట్టని కోటగా మారింది. అభ్యర్థులు ఎవరైనా విజయం కాంగ్రెస్ పార్టీదే. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నల్లగొండ కైవసం చేసుకునేందుకు గులాబీ దళం చేసిన దండయాత్రలు విపలం అయ్యాయి. గులాబీ జెండా ఎగురని లోకసభ నియోజకవర్గాల్లో నల్లగొండ ఒకటి.

హస్తం పార్టీకి అడ్డగా ఉన్న నల్లగొండ మీద కన్నేసిన బిజెపి… బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ మినహా మిగతా ప్రాంతాల్లో కమలం పార్టీకి అంతంగా పట్టులేదు.

దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాపైనే విజయం ఆధారపడి ఉంది. సైదిరెడ్డి నియోజకవర్గంలో సుపరిచితుడైనా కమలం శ్రేణుల్లో ఆయన పట్ల సానుకూలత లేదని వార్తలు వస్తున్నాయి. ప్యారాచుట్ నేతలతో పార్టీ ఇమేజ్ పాడవుతుందని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి తలపడుతున్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడైన కంచర్ల కృష్ణారెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యాక్రమాలను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు.

రాజకీయాలకు కొత్త అయిన కుందూరు రఘువీర్ రెడ్డి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు. సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకొని వ్యూహాత్మకంగా ఇద్దరు కుమారులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. చిన్న కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి ఇటీవల నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు పెద్ద కుమారుడు కాంగ్రెస్ నుంచి ఎంపిగా బరిలోకి దిగారు.

లోక్ సభ నియోజకవర్గం జానారెడ్డికి కొట్టిన పిండి. గ్రామ స్థాయి వరకు ఆయనకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. తన అనుభవంతో పార్టీ నేతలను సమన్వయము చేస్తూ తనయుడి విజయం కోసం మంత్రాంగం నడిపిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ నియోజకవర్గ పరిదిలోని వారే కావటంతో కాంగ్రెస్ శ్రేణులు సమరోత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు అందరు సీనియర్ నేతలే కావటంతో గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకునే వారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కలసి కట్టుగా ఉంటే విజయం ఎలా వరిస్తుందో చూసిన నేతలు ఇప్పుడు ఈ ప్రాంతంలో గులాబి వాసనే లేకుండా చేయాలనే పట్టుదలతో చక్రం తిప్పుతున్నారు.

జాతీయ రాజకీయాల ప్రభావం నేపథ్యంలో బీఆర్ఎస్ పోటీలో ఉన్నా బిజెపి – కాంగ్రెస్ ల మధ్యనే పోటీ నెలకొందని విశ్లేషకులు అంటున్నారు. లోక్ సభ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. పోలింగ్ నాటికి ఏవైనా అద్బుతాలు జరిగితే తప్ప కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్