Friday, November 22, 2024
HomeTrending Newsనంది నాటకాలు: సామాజిక సమస్యలపై అస్త్రాలు

నంది నాటకాలు: సామాజిక సమస్యలపై అస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీ.వి. నాటకరంగ అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతోన్న నాటకోత్సవాలు గురువారం ఆరోరోజుకు చేరుకున్నాయి. ఈ ప్రదర్శనలన్నీ సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాల్లాగా వుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టు కున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల ప్రతిభ ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది.

  1. నర్తనశాల (పౌరాణిక పద్యనాటకం):ఇది మహాభారతం విరాటపర్వంలోని పాండవుల అఙ్ఞాతవాస కథ. స్త్రీ వ్యామోహంలో పడి అధర్మ మార్గాన నడిచే వారందరికి అధఃపతనం తప్పదు. న్యాయమార్గాన నడిచేవారందరికీ ధర్మమే దైవమై నిలిచి కాపాడుతుందని ఈ నాటకం సందేశ మిచ్చింది. రంగకృష్ణయ్య రచనకు అర్జునరావు దర్శకత్వం వహించారు.
  1. మూడు ప్రశ్నలు (నాటిక):


    నేటి బాలల చదువుల తీరును ప్రశ్నించింది ఈ నాటిక. తల్లిదండ్రులు బళ్లో పెద్దలు ర్యాంకులు, మార్కులు అంటూ బాల్యాన్ని నలిపేస్తూ అనవసర పుస్తకాల మోతతో పిల్లలను మానసికంగా, శారీరకంగా బాధలకు గురిచేస్తున్న తీరును ప్రశ్నించి చదువుల తీరు తెన్నులు మారాలని చెప్పిన నాటిక ఇది. రచన: ఆకురాతి భాస్కర చంద్ర; దర్శకత్వం-వాసు. యంగ్ ధియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ప్రదర్శన ఇది.
  1. ఇంద్రప్రస్ధం నాటకం:

అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ప్రదర్శన ఇది. స్నిగ్ధ రచనకు ఎన్ రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. ప్రేమ అనేది సృష్టిలో గొప్పదే….కానీ….ఆ ప్రేమలు ఆనందించే విధంగా ఉండాలే తప్ప అనాలోచితంగా, వెర్రిగా పరుగెడితే జీవితం, విలువలు నాశనం అవుతాయని తెలియజెప్పిందీ నాటకం. ఆదర్శవంతమైన తండ్రి… బిడ్డల పెళ్లి విషయంలో ఎలా నడుచుకోవాలో తెలియజెప్పారు. నాన్న ఉంటేనే ఏ ఇల్లు అయినా ‘ఇంద్రప్రస్థం’లా వెలిగిపోతుందన్న సందేశం ఇచ్చింది.

4. మహాభినిష్క్రమణ నాటిక:

ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్ ధియేటర్ తెనాలి వారు ఆరాధ్యుల తేజస్వీ ప్రఖ్య రచనకు అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి దర్శకత్వ వహించిన యువ కళాకారుల పౌరాణిక నాటిక ఇది. రామాయణ కథలో శ్రీరాముడి అవతార పరిసమాప్తికి సంబంధించిన కథలను తీసుకుని నాటికగా మలచారు. శ్రీరామ అవతారం ముగిసే సమయం దగ్గర పడినప్పుడు బ్రహ్మదేవుడు కాలపురుషుడిని రాముడి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి రమ్మని చెప్పాడు. అప్పుడు కాలపురుషుడు రాముడి దగ్గరకు మారువేషంలో వచ్చి ఏకాంతంగా మాట్టాడాలని ఆ సమయంలో ఎవరూ అటు రాకూడదని వచ్చిన వారికి మరణశిక్ష విధించమని చెప్పాడు. రాముడు ఎవరూ లోపలికి రాకుండా తన తమ్ముడు లక్ష్మణుడినే కాపలా వుంచాడు. ఆ సమయంలో దూర్వాసుడు వచ్చి శ్రీరాముడిని అత్యవసరంగా కలవాలని లోనికి అనుమతించక పోతే రాజ్యాన్నే శపిస్తానని అన్నాడు. లక్ష్మణుడు చేసేది లేక తనవల్ల రాజ్య ప్రజలు బాధపడటమెందుకని అనుమతిస్తాడు. ఆఙ్ఞాభంగం చేసినందుకు లక్ష్మణుడు తన తమ్ముడైనా శిక్ష విధిస్తాడు. తమ్ముడైనా ధర్మం తప్పని శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ఈ నాటిక ప్రకటించింది.

5. పక్కింటి మెగుడు:

భార్యాభర్తలు సఖ్యతగా ఉంటేనే తన ఆస్థి మనవడికి దక్కుతుందని, లేకుంటే ఆస్థంతా ఒక ఆశ్రమానికి చెందేలా వీలునామా  రాసి కన్నుమూశారు. ఈ ఆస్తి కోసం రెండు కుటుంబాలకు చెందినవారు ఆడిన నాటకం, దాని వల్ల వారు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ నాటిక తెలియజెప్పింది.  ఇతరుల అవసరాలను అవకాశంగా తీసుకొని వారిని బ్లాక్‌మెయిల్ చెయ్యటం తప్పని సందేశం ఇస్తూనే హాస్యం రంగరించి ప్రదర్శితమైంది ఈ నాటిక. పండు క్రియేషన్స్ కొప్పోలు వారి ప్రదర్శన ఇది. రచన రామినేని నాగేశ్వర రావు, దర్శకత్వం బాలినేని నాగేశ్వర రావు.

6 ‘వసంత రాజీయం’ పద్యనాటకం:

శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారు తడకమళ్ల రామచంద్ర రావు రచనకు డాక్టర్ మారంరాజు రామచంద్ర రావు దర్శకత్వం వహించిన నాటకమిది. కొండవీటిని పాలించే రాజ కుమారగిరి రెడ్డి. అతనికి కర్పూరవసంతరాయలు అన్న బిరుదుంది. శత్రురాజ్యమైన కళింగ గూఢచారి మహేంద్రుడు లకుమయ అనే నర్తకి తల్లిని గురువును బంధించి ఆమె గురువు వీరరాఘవాచారిలా లకుమను వసంతరాజు వద్దకు తీసుకుని వస్తాడు. వసంతోత్సవాలలో నాట్యం చేసి రాజును మెప్పించి రాజనర్తకి ఔతుంది లకుమ. లకుమ నాట్యం భూమికగా ‘‘వసంతరాజీయం’’ నాట్యశాస్త్ర గ్రంధం వ్రాస్తూ ఆమె ప్రేమలో పడతాడు రాజు. ఆమె రాజును ప్రేమిస్తుంది. లకుమను అడ్డం పెట్టుకుని రాజును చంపాలని చూస్తుంటాడు. గూఢచారి మహేంద్రుడు.  రాజు పరిపాలనను, రాణిని విడిచి లకుమతోనే  గడుపుతుంటాడు. మహేంద్రుని కుట్రతో అడవికి వెళ్లి కుట్ర విఫలం, వీరి వివాహంతో వస్తారు. రాజు, లకుమ, రాణి, మంత్రి, సేనానుల కోర్కె పై లకుమను కలిసి రాజ్యం కోసం రాజును విడువమంటుంది. లకుమ మాటయిస్తుంది. మహేంద్రుడు రాజును చంపమని లకుమను ఒత్తిడి చేస్తాడు. మళ్లీ వసంతోత్సవాలలో వీరనాట్యం చేస్తూ తన్నుతాను పొడుచుకుంటుంది లకుమ. రాజు దుఃఖించి, మహేంద్రుని బంధించి, వసంతరాజీయం అంకితమీయగా తీసుకుని తృప్తిగా లకుమ కన్నుమూస్తుంది. చారిత్రక కథాంశాన్ని చక్కగా నాటకంగా మలచి చూపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్