Tuesday, January 21, 2025
HomeTrending Newsనంది నాటక వేడుకలకు సర్వం సిద్దం

నంది నాటక వేడుకలకు సర్వం సిద్దం

నాటక రంగానికి పునర్ వైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి.) నిర్వహిస్తోన్న నంది నాటకోత్సవం రేపు మొదలు కానుంది. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా డిసెంబర్ 23న మొదలుకానున్న ఈ వేడుకలు 29 వరకూ జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కళాభిమానులు ఈ నాటకోత్సవం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రాథమిక దశలో మెప్పించి తుది పోటీలకు అర్హత పొందిన కళాకారులు ఫైనల్స్ లో కూడా తమ సత్తా చాటి బహుమతులు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మొత్తం ఐదు  విభాగాలుగా పోటీలు జరగనున్నాయి. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు , సాంఘిక నాటికలు, కాలేజీ/యూనివర్సిటీ స్థాయి నాటికలు, బాలల నాటికలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి.

కాగా, ఈ ప్రాంగణానికి సత్య హరిశ్చంద్ర నాటక కర్త బలిజేపల్లిలక్ష్మీకాంత కవి పేరు పెట్టారు. రేపు శనివారం సభానంతరం  ఉదయం 11 గంటలకు రాజాంకు చెందిన కళా సాగర నాటక సంక్షేమ సంఘం  వారి ‘శ్రీ కాళహస్తీశ్వర మహత్యం’ పద్య నాటకంతో ఈ వేడుకలు మొదలు కానున్నాయి. కళారత్న డా. మీగడ రామలింగ స్వామి రచనలో మీగడ మల్లిఖార్జున స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనితో పాటు
సాంఘిక నాటకం విభాగంలో
శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారి ‘ఎర్ర కలువ’
రచన: ఆకురాతి భాస్కర్ చంద్ర; దర్శకత్వం: డా. వెంకట్ గోవాడ

సాంఘిక నాటిక విభాగంలో
శ్రీ అమృత లహరి థియేటర్ ఆర్ట్స్, గుంటూరు వారి ‘నాన్నా. నేనొచ్చేస్తా’
రచన: తాళాబత్తుల వెంకటేశ్వర రావు; దర్శకత్వం: అమృత లహరి

పద్య నాటకం విభాగంలో
శ్రీ దుర్గాభవాని నాట్య మండలి, తెనాలి వారి ‘శ్రీ రామభక్త తులసీదాసు’
రచన: డా. ఐ. మల్లేశ్వరరావు; దర్శకత్వం: ఆదినారాయణ
నాటకాలు మొదటిరోజు ప్రదర్శించనున్నారు.

నాటకరంగానికి విశేష కృషి చేసినవారికి, కళాకారులకు వ్యక్తిగత స్థాయిలో 1998 నుంచి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం’ తో లక్షా యాభై వేల రూపాయల నగదు ప్రదానం చేస్తున్నసంగతి విదితమే. కాగా ఈ ఏడాది నుంచి నాటక సమాజాలకు, పరిషత్తులకు ఇలాంటి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. నాటకరంగ అభివృద్ధికి  గణనీయమైన కృషి చేసిన సమాజాలు, పరిషత్తులకు డా. వై.ఎస్.ఆర్ రంగస్థల పురస్కారం పేరిట 5 లక్షల రూపాయల నగదు, ‘వైఎస్సాఆర్’ ప్రతిమ మొమెంటోతో సత్కరించబోతోంది. ఈ రంగంలో నిపుణులైన 27 మందిని ఈ రెండు ప్రతిష్టాత్మక అవార్డుల కోసం న్యాయ నిర్ణేతలుగా నియమించారు.

రేపు ఉదయం 9 గంటలకు శుభారంభ మహోత్సవ సభకు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సమాచార-పౌరసంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.  ఎఫ్.డి.సి. చైర్మన్ పోసాని కృష్ణ మురళి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిలు ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్