మొదటి నుంచి కూడా నాని వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. విభిన్నమైన ,.. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. కొంతకాలం క్రితం వరకూ నాని పాత్ర పరమైన కొత్తదనాన్ని నటన ద్వారానే చూపించేవాడు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన పాత్రకి తగినట్టుగా కొత్తగా తెరపై కనిపించడం కోసం, డిఫరెంట్ లుక్స్ ను ట్రై చేస్తున్నాడు. ఇటీవల వరుసగా వస్తున్న ఆయన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
నాని ఇంతవరకూ తెరపై చాలా పద్ధతిగా కనిపిస్తూ వచ్చాడు. మాస్ టచ్ ఉన్న పాత్రలు కొన్ని చేసినప్పటికీ, అవి ఒక స్థాయికి పరిమితమై ఉండేవి. అలాంటి నాని ‘దసరా’ సినిమా కోసం ఊరమాస్ గా మారిపోయాడు. చింపిరి జుట్టు .. బొగ్గు గనుల నేపథ్యం వలన వచ్చే ధూళితో నల్లగా మారిపోయిన శరీరం .. బట్టలు .. మొలచుట్టూ కట్టుకున్న ‘పవ్వ’ సీసాలు .. కాళ్లకు అరిగిపోయిన చెప్పులు .. ఇలా ఆయన పాత్రను డిజైన్ చేశారు.
నిజానికి ఇలాంటి ఒక గెటప్ ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. క్లాస్ టచ్ ఉన్న హీరోలలో చాలామందిని మాస్ హీరోలుగా ప్రేక్షకులు అంగీకరించలేదు. అలాంటిది నానీని ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారోననే ఒక డౌట్ ఇండస్ట్రీలో ఉంది. గట్టి మాస్ సినిమా చేసి .. తాను మాస్ సినిమాలు కూడా చేయగలనని నిరూపించాలనే కసి నానీలో ఉంది. అందుకు తగినట్టుగానే అయన కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు థియేటర్స్ దగ్గర కనిపిస్తోంది. నాని ఇప్పుడు పక్కా మాస్ హీరో కూడా. ఊర మాస్ పాత్రలను ఉఫ్ మని ఊదేయగలడన్న మాట.