తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లనున్నారు. బాబు అరెస్టుతో ఒత్తిడికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో సాగే ఈ పర్యటనలకు వచ్చే వారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. వారంలో రెండు లేదా మూడు ప్రాంతాల్లో ఈ టూర్ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును భువనేశ్వరి తో పాటు లోకేష్, బ్రాహ్మణి ములాకత్ లో కలుసుకున్నారు. దీనిలో ఈ టూర్ కు బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
రాష్ట్రంలో వరుస పార్టీ కార్యక్రమాల నిర్వహణకు టిడిపి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే భువనేశ్వరి పర్యటనతో పాటు బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని, చంద్రబాబు స్థానంలో నారా లోకేశ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో విస్తృతస్థాయి భేటి నిర్వహించి షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. ఇవి కొనసాగిస్తూనే ‘బాబుతో నేను’పై పెద్దఎత్తున ప్రచారం చేయనున్నారు. బాబు జైలు నుంచి విడుదలైన తరువాత లోకేష్ తన పాదయాతను కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.