రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ అసిస్టెంట్లను కట్టు బానిసల్లా వాడుకుంటోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7329మందిని ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్ మాన్ గ్రేడ్-2) గా నియమించారని, సచివాలయాల్లో ఉంటూ ఆయా గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను శాఖకు తెలియజేసి వాటిని పరిష్కరించాలని తొలుత చెప్పారని, కానీ వారిని శాఖకు అండర్ టేకింగ్ చేసి జాబ్ చార్ట్ కు విరుద్ధంగా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ లేఖ రాశారు.
మిగిలిన సచివాలయ ఉద్యోగులకు నెలలో దాదాపు ఏడు రోజులపాటు సెలవులు ఉన్నాయని, కానీ ఎనర్జీ అసిస్టెంట్లకు మాత్రం కనీసం ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వడం లేదని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. కేవలం 8 గంటలు మాత్రమే పని అని నిబంధనల్లో ఉన్నా 24 గంటలూ వీరు డ్యూటీ చేయాల్సి వస్తోందన్నారు. ఇటీవల వీరు తనను కలిసి తమ బాధలు చెప్పుకున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని, ఈ ఉద్యోగులను వెంటనే విద్యుత్ శాఖలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వీరిని మిగతా సచివాలయ ఉద్యోగుల మాదిరిగా రోజుకు 8 గంటల పనిదినాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ వ్యవస్థ అనే బూటకపు ముగుసులో ఎనర్జీ అసిస్టెంట్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.