తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పార్టీ నేతలకు తెలిపారు. నేడు చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు మంగళగిరిలో లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో లోకేష్ పాదయాత్ర అంశం చర్చకు వచ్చింది. దీనిపై ఇటీవల వివిధ మీడియాల్లో వచ్చిన వార్తలపై నేతలు లోకేష్ తో ప్రస్తావించగా, ఆయన క్లారిటీ ఇచ్చారని సమాచారం.
జనవరి 26న హైదరాబాద్ నుంచి బయల్దేరి కుప్పం చేరుకుంటారు. మర్నాడు కుప్పం నుంచి యాత్ర మొదలవుతుంది. కుప్పం నుంచి ఇచ్చాపురం దాదాపు ఏడాదిపాటు యాత్ర ఉంటుంది. మధ్యలో విరామం లేకుండా ఏకబిగిన యాత్ర సాగనుందని తెలుస్తోంది. పాదయాత్ర విధి విధానాలు, రూట్ మ్యాప్, యాత్రలో ఫోకస్ చేయాల్సిన అంశాలపై త్వరలో చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమై ఖరారు చేస్తారని తెలుస్తోంది.
ఈ విషయమై పార్టీ అధికారికంగా ప్రకటన చేసేందుకు కొంత సమయం తీసుకోవాలని టిడిపి భావిస్తోంది. రెండు మూడు నెలలు ముందుగానే యాత్ర ప్రకటించి, తద్వారా ఏవైనా రాజకీయ పరిణామాలు సంభవిస్తే నిర్ణయం మార్చుకోవాల్సి వస్తుందని, అందుకే అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని జనవరి మొదటి వారంలో దీనిపై అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు.