పోలవరం నిర్వాసితులను, వారి సమస్యలను జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో లోకేష్ పర్యటన నేడు రెండో రోజు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం పెదవేంపల్లిలో పునరావాస కాలనీని సందర్శించిన లోకేష్ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని లోకేష్ కు మొరపెట్టుకున్నారు.
భావి తరాల కోసం, రాష్ట్ర భవిషత్తుకోసం త్యాగాలు చేసిన పోలవరం నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తన బాధ్యతను సిఎం జగన్ విస్మరిస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. నిర్వాసితుల గోడు వినేందుకు వస్తే రెచ్చగొడుతున్నానంటూ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. గతంలో నిర్వాసితులకు ఎకరానికి 19 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, అదికూడా అందరికీ అందడంలేదని లోకేష్ ఆరోపించారు. జగన్ ఈ హామీలు ఇస్తున్నప్పుడు కన్నబాబు కూడా పక్కనే ఉన్నారని లోకేష్ గుర్తు చేశారు. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న తమ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి కి కనీస గౌరవం ఇవ్వకుండా నేలపై కూర్చోబెట్టడం దారుణమన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకూ అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని లోకేష్ హెచ్చరించారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి వందరూపాయలు లాక్కుంటున్నారని లోకేష్ విమర్శించారు. టిడిపి నేతలు దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, రాజేశ్వరి తదితరులు కూడా పర్యటనలో పాల్గొన్నారు.