Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణను నియంత్రించండి : లావు వినతి

తెలంగాణను నియంత్రించండి : లావు వినతి

కృష్ణాజలాలపై కేఆర్ఎంబి ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నీటి తరలింపుతో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్సీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఒప్పందాలకు అనుగుణంగా నీటి తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పందాలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని మరలించి ఏకపక్షంగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని, దీంతో ఆంధ్రప్రదేశ్ లో సాగు, తాగు నీటికి ఎద్దడి ఏర్పడుతోందని.. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు రాసిన లేఖలో ఎంపీ పేర్కొన్నారు.

కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. పులిచింతల, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి వాడకాన్ని క్రమబద్ధీకరించుటకు రెండురాష్ట్రాల మధ్య 2014 లో ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతులు, ఆదేశాలు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంనుంచి 4 టీఎంసీలు, సాగర్ నుంచి 3టీఎంసీలు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలు నీటిని ప్రతి రోజు వినియోగించుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటితో విద్యుత్ ను ఉత్పత్తి చేయటం వల్ల నీరు వృధా అయ్యి, నెల్లూరు, ప్రకాశం గుంటూరు జిల్లాల రైతుల మనుగడకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు.

ఖరీఫ్ సీజన్లో నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా 110 టీఎంసీల నీటితో గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు వరి, మిర్చి పంటలను పండిస్తున్నారని, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని రైతులందరూ పూర్తిగా సాగర్ కుడి కాల్వ నీటి పై ఆధారపడి.. 1.2 లక్షల హెక్టార్లలో మిర్చి, పత్తి, వరి, పసుపు తదితర పంటలను పండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బోర్డ్ అనుమతులు లేకుండా కృష్ణా నీటిని మరలించటంతో
ఈ ప్రాంతాలు నీటి ఎద్దడికి గురై రైతులు తక్కువ దిగుబడులు ఇచ్చే పంటలను సాగు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీని వల్ల రైతులు వేల కోట్ల రూపాయలు నష్ట పోతారాని.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం చేస్తున్న నీటి తరలింపుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జలశక్తి శాఖ మంత్రిని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్