Cheap Liquor row: బిజేపి నేతలు దిగజారిపోయారని, చివరకు చీప్ లిక్కర్ పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ఇది బిజెపి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు విద్య, వైద్యం, ఇతర పథకాలపై మాట్లాడితే సంతోషించి ఉండేవాడినని, 50 రూపాయలకు చీప్ లిక్కర్ ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. పేదవాడి కోసం అలోచించి మధ్య నియంత్రణ కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దశలవారీ మధ్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని అయన స్పష్టం చేశారు. పేదవాడి నెత్తురు తాగి ఆ ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపకూడదన్నది సిఎం జగన్ లక్ష్యమని అన్నారు.
రాజకీయాల్లో వారసత్వం గురించి మాట్లాడతారని, మరి సినిమాల్లో వారసత్వం సంగతేమిటని నారాయణ స్వామి ప్రశ్నించారు. సినిమాల్లో కూడా వారసత్వం పెరిగిపోయిందని, తెలుగు సినిమా రంగాన్ని మూడు కుటుంబాలు శాసిస్తున్నాయని, వీరు కొత్త సినిమాలకు థియేటర్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. పేదవాడికి సినిమా వినోదమని, కానీ ఆ పేదవారిని ఆదుకోవడానికి మాత్రం సినిమావారు తగినంతగా ముందుకు రారని వ్యాఖ్యానించారు. ఒక్కో టికెట్ ను 2 వేలు, 3 వేలకు అమ్మడం సరికాదన్నారు. నిర్మాత నష్టపోయినప్పుడు హీరోలు వారిని ఆదుకోవడానికి ముందుకు రావడంలేదన్నారు. సినిమా రంగానికి చెందిన కొంతమంది జీఎస్టీ కూడా సరిగా కట్టడం లేదని నారాయణ స్వామి విమర్శించారు.
Also Read : ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో: సోము డిమాండ్