యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వపోగా… బీజేపీ ఎంపీలు వరి వేయండని తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొడుతూ అయోమయానికి గురిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బిజెపిపై ధ్వజమెత్తారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ పాలన దృతరాష్ట్ర,దుర్మాగ్గపు పాలన అని ధ్వజమెత్తారు.అన్నం పెట్టే రైతుతో చెలగాటం ఆడుతున్నారు దేవుడు కూడా క్షమించడన్నారు.అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టి ఉద్యోగులను,నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు.కేంద్ర ప్రభుత్వం వల్ల అన్ని వర్గాలు నష్టపోయాయే తప్పా..ఎవ్వరికి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు.మోడీ పాలనలో అంబానీ,అదాని మాత్రమే లాభపడ్డారన్నారు.అంబానీ,అదాని ఉంటే చాలా మీకు..? ప్రజలు,రైతుల ప్రయోజనాలు అక్కర్లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రైతులు తలుచుకుంటే ఢిల్లీ పీఠం మీద ఉండగలరా అని నిలదీశారు.బండి సంజయ్,అర్వింద్ పార్లమెంట్ లో తెలంగాణ రైతుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి ప్రశ్నించారు.ఇక్కడేమో వరి వేయండని రైతులను రెచ్చగొట్టి అయోమయానికి గురిచేస్తున్నారని, పార్లమెంట్ లో ఏం మాట్లాడట్లేదని అన్నారు. టిఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర రైతుల కోసం పార్లమెంట్ లో వారం రోజులుగా పోరాడుతుంటే బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు.పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి రైతులను ఆందోళనకు గురిచేసే విధంగా మాట్లాడారని మండిపడ్డారు.
ధాన్యం కొంటారా.. కొనరా అంటే మార్చిలో ఆలోచిస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నదన్నారు.రైతుల ప్రయోజనాలపై మరీ ఇంత నీచపు రాజకీయాలు ఎన్నడు చూడలేదన్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బాయిల్డ్ రైస్ కొనాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.పోయిన యాసంగిలో కొంటామన్న 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లో 24 లక్షలే తీసుకున్నారని గుర్తు చేశారు.పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఇలా రైతుల జీవితాలతో చెలగాటం ఆడడం హేయనీయమన్నారు.రైతు పండించే పంటను కండిషన్ పెట్టి కొంటామనడం దుర్మార్గం అన్నారు.రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషిస్తూ ఓ కొడుకు విషయంలో తీసుకునే నిర్ణయంలా ఉండాలన్నారు.తెలంగాణ రైతుల ప్రయోజనాల గురించి ఇక్కడ మాట్లాడినట్లు బండి సంజయ్,అర్వింద్ పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు.టిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఎంపీ లా..? బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కాదా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ఎంపీలతో కలిసి తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని మంత్రి కోరారు.