Friday, November 22, 2024
HomeTrending Newsవిద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల కోసం వనదర్శిని

విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల కోసం వనదర్శిని

అడవులను కాపాడటం, పర్యావరణ ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికి తెలిపేలా తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. జాతీయ, అంతర్జాతీయంగా పర్యావరణ ప్రాధాన్యత ఉన్న తేదీల సందర్భంగా అటవీశాఖ వివిధ ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వనదర్శిని, నేచర్ వాక్, ఫారెస్ట్ బాతింగ్, బర్డ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. వీటి ఆధారంగా ముఖ్యంగా స్కూలు విద్యార్థుల్లో ప్రకృతి, పర్యావరణం పట్ల అవగాహన పెంచటం, అడవుల ప్రాధాన్యత తెలిసేలా చేయటం, అడవుల్లో ఉండే వివిధ రకాల చెట్లు, జంతువుల వల్ల సమతుల్యత ఎలా ఏర్పడుతుందనే అంశాలను అటవీ శాఖ అధికారులు వివరిస్తున్నారు. అడవులు అంతరిస్తే ఎదురయ్యే ముప్పు, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, మనుషుల ఆవాసాలు – జంతువుల మధ్య సంఘర్షణ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు వివరిస్తున్నారు. వీరు ప్రకృతి పట్ల సమాజంలో మార్పు కోసం ఛేంజ్ ఏజెంట్లుగా పనిచేస్తారని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ) ఆర్.ఎం.డోబ్రియాల్ అన్నారు.

జాతీయ పక్షి దినోత్సవం (జనవరి -5) వివిధ అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. తాడ్వాయి అటవీ ప్రాంతం (ములుగు జిల్లా), కవాల్ టైగర్ రిజర్వ్ (జన్నారం), వేంపల్లి అటవీ ప్రాంతం (కేబీ అసిఫాబాద్ జిల్లా), నెహ్రూ జూ పార్క్ (హైదరాబాద్)ల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ములుగు జిల్లా తాడ్వాయి హట్స్, బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ సమీపంలో నేచర్ వాక్, బర్డ్ వాచింగ్, కొత్తగా అభివృద్ది పరిచిన గడ్డిమైదానాల్లో (గ్రాస్ ప్లాట్స్) ఫోటోగ్రఫీ కార్యక్రమాలను అటవీ శాఖ నేతృత్వంలో జిల్లా అటవీ అధికారి కిష్టా గౌడ్ నిర్వహించారు. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో జరగనున్న నేపథ్యంలో పరిసరాల్లో ప్లాస్టిక్ నియంత్రణ, చెత్త ఏరివేత, స్థానికులకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టారు. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ను సేకరించి రీసైక్లింగ్ కు పంపారు. పర్యావరణ ఔత్సాహికులు, నేచర్ ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కొమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ డివిజన్ వేంపల్లి అటవీ ప్రాంతంలో ఎఫ్.డీ.ఓ కే.విజయ్ కుమార్, రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులు, టీచర్లు, డిగ్రీ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థులు, రీ క్యాప్ స్వచ్చంద సంస్థ నిర్వాహకులతో కలిసి వనదర్శని కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి ఒడే తరగతి గదిలాగా స్కూలు పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు కనెక్టింగ్ టు నేచర్ ద్వారా అడవిని పరిచయం చేసి, స్వయంగా ప్రాధాన్యత తెలిసేలా చేశామని అధికారులు తెలిపారు.

కవాల్ టైగర్ రిజర్వ్, జన్నారంలో నేచర్ వాక్, బర్డ్ వాచింగ్ కార్యక్రమాలను స్థానిక డిప్యూటీ కన్జర్వేటర్ మాధవ రావు, సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఇక నెహ్రూ జూ పార్క్ లోనూ స్కూలు పిల్లలతో జంతువులు, పక్షులకు ఫీడింగ్ చేయటం, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవటంపై అధికారులు అవగాహన కల్పించారు. వనదర్శని, బర్డ్ వాచింగ్ లాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకుని అటవీ, పర్యావరణ విద్యపై అవగాహన కల్పించేలా జిల్లాల అటవీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ) ఆర్.ఎం.డోబ్రియాల్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్