Administrative Reforms: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యంకోసమే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పారంభించామన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడతాయన్నారు. కొత్త వాటితో కలిపి మొత్తం 26 జిల్లాలు వస్తాయన్నారు. కొత్త వాటిలో రెండు గిరిజన జిల్లాలు కూడా ఉంటాయన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
రాష్ట్ర గవర్నర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనతరం పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ శాఖలు తమ శకటాలను ఈ సందర్భంగా ప్రదర్శించాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖనుమ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తన సందేశమిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, అధికారం చేపట్టగానే 17,265 కోట్ల రూపాయల భారం పడినా 27 శాతం ఐఆర్ ఇచ్చామని, కోవిడ్ తో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినా 23 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై 10,267 కోట్ల రూపాయల భారం పడుతుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉగ్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచామన్నారు. దేశంలోనే ఇలా వయో పరిమితిని పెంచిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. గ్రాడ్యుటీని 12 నుంచి 16 లక్షల రూపాయలకు పెంచామన్నారు.
విభజనతో తలెత్తిన రెవెన్యూ లోటు, కోవిడ్ తో ఆదాయం తగ్గుదల ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, ఉన్నంతలో మంచి పీఆర్సీని అమలు చేస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూడా గవర్నర్ తన సందేశంలో వివరించారు.
Also Read :కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం