Historical Decision: కొత్తజిల్లాల ఏర్పాటుకు అనుకూలమో, వ్యతిరేకమో ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాసరావు డిమాండు చేశారు. గత రెండున్నరేళ్ల నుంచి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సిఎం జగన్ 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. దీనితో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే దిశగా, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ వైపు మరో గొప్ప ముందడుగు పడిందన్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించడం, ఆ కొత్త జిల్లాలకు మహానుభావుల పేర్లు పెట్టడం అందరూ స్వాగతించాల్సిన విషయమని, ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులంతా దీన్ని మంచి నిర్ణయంగా భావిస్తున్నారని, చంద్రబాబు కూడా తన వైఖరి స్పష్టంగా చెప్పాలని అవంతి కోరారు.
జిల్లాల ఏర్పాటు నిర్ణయానికి కృతజ్ఞతగా భీమిలి నియోజకవర్గంలో నేడు మంత్రి ఆధ్వర్యంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సంద్రభంగా అవంతి మాట్లాడుతూ నేటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేని సాహసోపేత నిర్ణయం జగన్ తీసుకున్నారని, ఇది పరిపాలనా వీకేంద్రీకరణ కు తొలిమెట్టు అని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడిచేలా ఇలాంటి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఉన్నతంగా ఆలోచించే ఆలోచనాతత్వం ఉన్న జగన్ లాంటి నేతలకే సాధ్యమన్నారు. దేశంలో రెండో అతిపెద్ద మున్సిపాలిటీ గా చరిత్రలో లిఖించబడిన చారిత్రాత్మక కట్టడాలు కలిగిన భీమిలి ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమయంలో భీమిలి శాసనసభ్యుడు గా ఉండటం, ఇక్కడి ప్రజలకు సేవలు చేసి, వారి ఆదరాభిమానాలు సంపాదించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు అవంతి. వీకేంద్రీకరణ కోసం 26 రాష్ట్రాల తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా కు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు – కృష్ణా జిల్లాకు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టడం ఇచ్చిన మాటను మాట మార్చకుండా మడం తిప్పకుండా చేయడం ఒక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే చెల్లిందన్నారు
Also Read : కొత్త సమస్యలు రాకూడదు: జిల్లాలపై బాబు