Sunday, January 26, 2025
HomeTrending NewsBonalu: జులై 9న సికింద్రాబాద్ బోనాలు

Bonalu: జులై 9న సికింద్రాబాద్ బోనాలు

సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా మంత్రిని ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా పాలక మండలి సభ్యులను మంత్రి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గోల్కొండలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్ బోనాలు, ఆ తర్వాత ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఈ సంవత్సరం సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన, 10 వ తేదీన రంగం (భవిష్యవాణి) నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాలు, బతుకమ్మ వేడుకల విశిష్టతను తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచి విశ్వవ్యాప్తం చేసిందని చెప్పారు. అనేక దేశాలలో ఎంతో ఘనంగా బోనాలు, బతుకమ్మ పండుగలను జరుపుకుంటారని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. బోనాల ఉత్సవాల సందర్బంగా నగరం నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది హాజరై అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. ఎన్ని లక్షల మంది వచ్చినప్పటికీ భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మహాకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఆలయం పరిసరాలలో రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో చేసినట్లు చెప్పారు.

అమ్మవారి బోనాల మరుసటి రోజు వివిధ వేషదారణలు, డప్పు చప్పుళ్ళు, కళాకారుల నృత్యాలతో నిర్వహించే ఫలహారం బండ్ల ఊరేగింపు ఉత్సవాలకే ప్రత్యేక శోభను తీసుకొస్తాయని అన్నారు. ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే అధికారులు, కమిటీ సభ్యులతో ఒక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు, పాలకమండలి సభ్యులు సమన్వయంతో వ్యవహరించి ఆలయ అభివృద్దికి కృషి చేయడమే కాకుండా ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మీ పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ కృష్ణ, EO మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్