‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని మనకు వచ్చిన ప్రతీ ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. అయిదు కోట్ల మందికీ జవాబుదారీగా ఉండాలని’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా బయల్దేరి వెళ్ళారు. టిడిపి అధినేత బాబుతో కలిసి ఒకే విమానంలో హస్తినకు వెళ్ళారు. అంతకుముందు ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపిలతో పవన్ భేటీ అయ్యారు. విజేతలను అభినందించిన పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పట్ల మరింత బాధ్యతతో కలిసి పని చేయాలని సూచించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని హితవు పలికారు.
“సినిమాలకు సెన్సార్ ఉంటుంది. ఇంట్లో టీవీలకు ఉండదు. టీవీల్లో చూసేవి ఇంట్లో అందరినీ ప్రభావితం చేస్తాయి. శాసనసభ సమావేశాలుగానీ, ప్రజాప్రతినిధుల మాటలుగానీ టీవీల్లో చూస్తున్నప్పుడు భావి తరాల వారు వాటిని స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన నాయకులు మాట్లాడాలి, నడుచుకోవాలి. అలాగే జనసేన ప్రయాణం ఉంటుంది. రాజకీయాలను కెరీర్ చేసుకోవాలనే స్ఫూర్తిని యువతలో నింపేలా జనసేన ముందుకు సాగుతుంది” అంతో భరోసా ఇచ్చారు.
పిఠాపురంలో పవన్ విజయంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత ఎన్వీవీఎస్ వర్మ ఈ భేటీలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. పవన్ ఆయన్ను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కీలక నేత, పవన్ సోదరుడు నాగబాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.