ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటి ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని తెలంగాణా వాసి గరిమళ్ళ శ్రీనివాస్ చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దక్షిణ మండలిలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. తాము పనులు నిలిపివేశామని, పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని ఏపి ప్రభుత్వం ట్రిబ్యునల్ కు తెలిపింది. దీనిపై ఎన్జీటీ అనుమానం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పర్యావరణ శాఖలను ఆదేశించింది. తదుపరి విచారణ జులై 12కి వాయిదా వేసింది.