పేద ప్రజల దవాఖాన నిమ్స్‌కు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా త్వరలోనే నిమ్స్ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం, బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2 వేల పడకల సామర్ధ్యంతో కొత్తగా మూడు బ్లాకులు నిర్మించనున్నట్టు చెప్పారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్‌లు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. గచ్చిబౌలి, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో నిర్మించనున్న టిమ్స్‌తోపాటు వరంగల్ హెల్త్‌సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నాలుగు టిమ్స్ దవాఖానలు, నిమ్స్ విస్తరణ చేపట్టారని.. దీంతో మరో ఆరువేల పడకలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ట్రామా కేర్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం నిమ్స్‌కు రోజుకు సగటున 2,000-3,000 ఓపీ నమోదవుతున్నది. ప్రస్తుత భవనం సామర్థ్యానికి ఇది చాలా ఎక్కువ. దీంతో కొత్త భవనంలో ఓపీ సేవల కోసమే ఒక బ్లాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా ఎనిమిది అంతస్తుల్లో ఓపీ బ్లాక్‌ను నిర్మించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ కేసులకు నిమ్స్ కేరాఫ్‌గా ఉన్నది. ఎమర్జెన్సీ విభాగంలో నిత్యం పడకల సమస్య ఎదురవుతున్నది. దీంతో విస్తరణలో భాగంగా ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్థులతో బ్లాక్ నిర్మిస్తున్నారు. ఇన్‌పేషంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 2,000 పడకలు అందుబాటులోకి వస్తుండగా అన్నింటికీ ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. అందుబాటులోకి వచ్చే పడకల్లో 1,200 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు ఉంటాయి. పేయింగ్ రూమ్స్ ఉంటాయి. కొత్తగా పేయింగ్ రూమ్స్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. 300 గదులు ఇందుకోసం కేటాయిస్తారు. ప్రస్తుతం నిమ్స్‌లో 30 విభాగాలు సేవలు అందిస్తుండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35కు పెరుగుతుంది.
నిమ్స్ విస్తరణకు అదనంగా 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను నిర్మించనున్నారు. ఈ పనులకు ఇటీవలే మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిమ్స్‌లో గైనకాలజీ విభాగం సేవలు అందుబాటులో లేవు. ప్రసవాలు కూడా జరగడం లేదు. ఎంసీహెచ్ నిర్మాణంతో ఈ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంసీహెచ్ నిర్మాణానికి రూ.55 కోట్లు వెచ్చించనున్నారు. నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో 8 అంతస్తులకు పెంచుకొని ప్రత్యేక బ్లాక్‌గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
నిమ్స్‌లో..
ప్రస్తుతం పడకలు : 1489
అదనపు పడకలు : 2000
మొత్తం : 3,489
కేటాయించిన విస్తీర్ణం : 33 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం రూ.1571 కోట్లు
అందుబాటులోకి వచ్చే పడకలు
ఆక్సిజన్ బెడ్లు : 1200
పేయింగ్ రూమ్స్ : 300
ఐసీయూ బెడ్లు : 500
మొత్తం : 2000