Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రభుత్వ 'పన్నుల' వైద్యం

ప్రభుత్వ ‘పన్నుల’ వైద్యం

Tax as Obesity medicine: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకోసం, ప్రజల వలన, ‘ప్రజాప్రతినిధుల’తోనే ఏర్పడతాయి. ఇది ‘సిద్ధాంతీకరించబడిన’ సత్యం కాబట్టి మనం ఒప్పుకొని తీరవలసిందే, వేరే మార్గం లేదు.

ఎటొచ్చీ  ఇలా గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు చేసే ప్రతి పని, చేపట్టే ప్రతి కార్యక్రమం  ప్రజల మేలుకోసమే అంటుంటే.. కాదని తెలిసినా ప్రజలు నోరెత్తలేరు..

ఒక వేళ ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఒంటబట్టించుకున్న కొందరు నోరెత్తితే.. సదరు ప్రజాప్రతినిధులు మామూలుగానే ఊరుకోరు… అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఊరుకోరు. ‘స్వామి ద్రోహం’, ‘రాజ ద్రోహం’, ‘ప్రభుత్వ వ్యతిరేక కుట్ర’ వంటి చట్టాల కొరడాలతో  ఇబ్బంది పెడతారు.

ముఖ్యంగా మన ప్రజాస్వామ్యంలో  నాయకులను ప్రశ్నించే స్వేచ్చ ప్రజలకు లేదు. ప్రశ్నించే ప్రజలను ఒర్చుకొనే సహనం నాయకులకూ లేదు. కాబట్టి అంతా మన మంచికే అని ఒప్పేసుకోవడమే అసలు సిసలైన ప్రజాస్వామ్యం.

Tax On Foods

అయితే ప్రజాస్వామ్యం ప్రతి పక్ష పాత్ర కీలకం. అధికారం పార్టీ చేసే ప్రతి పనీ  ప్రజావ్యతిరేకమని ప్రతిపక్షం వాదిస్తుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న “ప్రజా ప్రతినిధులు” ఏమి మాట్లాడినా.. అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు “అభివృద్ధి కి అడ్డం” అంటారు. ఇద్దరు చెప్పేవి “సత్య దూరాలని” ప్రజలకు తెలిసినా.. నోరెత్తకుండా, గుడ్లప్పగించి ఎవరి పని వారు చేసుకోవడమే వారి వంటికి, ఇంటికి మంచిది.

మోడీ  ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే “ప్రణాళిక సంఘాన్ని” పాత చింతకాయ పచ్చడి అని తీసేసి.. కొత్తగా “నీతి ఆయోగ్” (National Institute for Transforming India) అనే సంస్థ ను ఏర్పాటు చేసి.. మొత్తం దేశాన్నే ట్రాన్స్ ఫార్మ్ చేయాలని లక్ష్యం నిర్దేశించారు.

ఈ సంస్థ ఏర్పాటైన రోజునుంచి దేశాన్ని ‘ట్రాన్స్ ఫార్మ్’ చేయాలనే లక్ష్యాన్ని తప్పుగా అర్ధం చేసుకొందో, లేక తనకిచ్చిన ‘రహస్య లక్ష్య’ సాధనకు కృషి చేస్తోందో తెలియదు కానీ తన ఏర్పాటుకు కారణం అయిన ప్రభుత్వ పెద్దల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని, ప్రజలను ‘ట్రాన్స్ ఫార్మ్’ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

  • పార్లమెంట్ చేసిన చట్టాలు అమలు చేయకుండా ‘ఎలా’ తప్పించుకోవాలి
  • రాజ్యాంగం రాష్ట్రాలకు ప్రసాదించిన హక్కులు ‘ఎలా’ హరించాలి
  • ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి.. ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను.. చివరకు రోడ్లు, రైళ్ళు, క్రీడా మైదానాలతో సహా  ‘ఎలా’ అమ్ముకోవాలి
  • ప్రజల పై పన్నులు వేసి ‘ఎలా’ పీల్చి, పిప్పి చేయాలి
  • సహజ ఇంధన వాడకం, తద్వారా దిగుమతి తగ్గించడానికి.. వాటి రేట్లు పెంచి ‘ఎలా’ ప్రజల నడ్డి విరగ్గోట్టాలి..
  • పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాలను ‘ఎలా’ తగ్గించాలి, పన్నుపై పన్ను ‘ఎలా’ వేయాలి

  • ముడి సరుకు నుంచి ఉత్పత్తి అయ్యే వరకు ప్రతి స్టేజ్ లో పన్ను, అమ్మితే పన్ను, కొంటే పన్ను, తింటే పన్ను ఇలా GST పేరుతో.. ప్రతి దాని మీద పన్ను, దాని మీద పన్ను ‘ఎలా’ వెయ్యాలి..
  • “ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్” పేరుతో రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి రాష్ట్ర ఆస్తులను ఇన్సెంటివ్ లు, సబ్సిడీ ల పేర్లతో పారిశ్రామిక వేత్తలకు ‘ఎలా’ దోచి పెట్టాలి
  • పబ్లిక్ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ పేరుతో ప్రజా ఆస్తులను ప్రైవేటు వారికి ‘ఎలా’ అప్పచెప్పాలి

వంటి విన్నూత్న ఆలోచనలతో ముందుకు దూసుకొని వెళ్తున్నది.

సదరు నీతి ఆయోగ్ వారి సలహా, సూచనలతో కేంద్ర ప్రభుత్వం.. గత  ఎనిమిదేళ్ళలో 78 లక్షల కోట్ల కొత్త అప్పు తెచ్చి మరీ దేశాన్ని అభివృద్ధి చేసింది. 1950 నుంచి 2014 వరకు, 64 సంవత్సరాలలో కేంద్రం చేసిన అప్పు 57 లక్షల కోట్లు అయితే.. నీతి ఆయోగ్ ఆధ్వర్యం లో ఈ ఎనిమిదేళ్ళలో 136 లక్షల కోట్ల కు చేరింది అంటే చూడండి.. నీతి ఆయోగ్ ఎంత అద్భుతం గా పనిచేస్తుందో.. “పన్నుల” సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు.

గత ఎనిమిదేళ్లు గా ఒక్క పెట్రోల్, డీజిల్ పై పన్నుల ద్వారానే ప్రభుత్వ ఆదాయం దాదాపు 17 లక్షల కోట్లు. ఇవన్నీ నీతి ఆయోగ్ కిరీటంలో ‘కలికి తురాయిలు’.

ఇక ఇప్పుడు సదరు ‘నీతి ఆయోగ్’ వారు.. ప్రజల నానా రకాల అనారోగ్యాలకు కారణం వారి ఊబకాయమేనని నిర్ధారించి.. ఈ ఊబకాయానికి కారణం ప్రజలు అయినకాడికి “చక్కెర, కొవ్వు, ఉప్పు” ఉన్న పదార్ధాలు తినడమేనని గ్రహించి.. కాబట్టి ఈ పదార్ధాలు ప్రజలకు “వీలైతే దొరకకుండా” లేదా “అతి కష్టం మీద దొరికేలా” చేయడమే పరిష్కారమని భావించి.. దీనికి “చక్కెర, కొవ్వు, ఉప్పు” పదార్ధాలపై “పన్నులు” అయినకాడికి పెంచేయడమే “విరుగుడు” అని నిర్ణయించి..

దీనికి సంబంధించిన ప్రతిపాదనను తెగ “పరిశీలిస్తున్నారట”.

ఒక “కారం” తప్ప.. “చక్కెర, కొవ్వు, ఉప్పు” లేని ఆహార పదార్ధం వెతికినా దొరకదు.. కాబట్టి ప్రజల ఊబకాయం తగ్గించడానికి.. ప్రజల ఆరోగ్యం కోసం.. మనసు రాయి చేసుకొని “చక్కెర, కొవ్వు, ఉప్పు” ఉన్న ఉత్పత్తులపై “పన్ను” పెంచమని.. కేంద్రానికి సిఫార్సు చేయక తప్పదు.. కేంద్రం పెంచకా తప్పదు.. జనం కొనలేక, కొనలేక, “కొని” తినక తప్పదు..

కాని ప్రభుత్వం ఇంతా చేసిది ఎవరి కోసం? ప్రజల కోసం..వారి ఊబకాయం తగ్గించడం కోసం..వారి రోగాలు తగ్గించడం కోసం.. ‘ఆయుష్మాన్ భారత్’ కోసం.. నమ్మలేని నిజం అనిపిస్తుంది కదూ.. కాని నమ్మక తప్పదు..

ఎందుకంటే మన ప్రజాస్వామ్యం లో ప్రభుత్వాలు ఏది చేసినా అది ప్రజలకోసమే.  కాదంటే ‘రాజద్రోహమే’..

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

ఇవి కూడా చదవండి: 

మంచింగ్ మాఫియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్