మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది చోట్ల ఈవిఎంలు ధ్వంసం అయితే ఒక్క సంఘటనే ఎందుకు బైటకు వచ్చిందని నరసరావుపేట ఎంపి అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇవిఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారని, ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. మాచర్లలో పలు పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం రిగ్గింగ్ కు పాల్పడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడిందని… ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారన్నారు. పల్నాడు జిల్లాలోని పలు మాచర్లతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా టిడిపి నేతలు ఇవిఎం లు పగలగొట్టారని, తుమ్మురుకోట, వబుచెర్లలో ఇవిఎంలు ధ్వంసం చేశారని చింతపల్లిలో రిగ్గింగ్ చేశారని వివరించారు. పాల్వాయి గేటు ప్రాంతంలో టీడీపీ నేతలు విధ్వంసం చేశారని, ఆ అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. టిడిపి రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలని, ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.