Monday, January 20, 2025

నోటు మాటలు

Note- Fate: దేశ వాణిజ్య రాజధాని బాంబేలో యాభయ్యవ అంతస్తు అద్దాల మేడ. అరేబియా నీలి సముద్రం మీద సూర్యుడి కిరణాలు పడి తళతళలు అద్దాలమేడ మీద ప్రతిఫలిస్తున్నాయి. విలేఖరులందరూ వడా పాప్ తిని, చాయ్ తాగి ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. అధికారి ఎర్రటి ఎండలో గట్టి కోటు, మెడను బిగిస్తూ గట్టిగా టై కట్టుకుని వచ్చి సీట్లో కూర్చున్నారు. నేరుగా విషయంలోకి దిగారు.

అధికారి:-
రెండు, మూడు వారాలుగా మీడియాలో నోట్ల గురించి నోటికేదొస్తే అది చెప్తున్నారు. చేతికేదొస్తే అది రాస్తున్నారు. మీ రాతలవల్ల దేశ ప్రజలకు నోటంటే విలువ లేకుండా పోతోంది. అందుకని అన్ని విషయాలు వివరంగా చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము. పక్కన ఫైవ్ స్టార్ ట్రైడెంట్ నుండి తెప్పించిన వడా పావ్ అందరూ తిన్నారు కదా? నాక్కూడా వడా పావ్ చాలా ఇష్టం. ఇప్పుడే రోడ్డు పక్కన కారాపి రెండు లాగించి వచ్చా…

విలేఖరి:-
సార్! ఈ ప్రెస్ మీట్ వడా పావ్ గురించా? నోట్ల రద్దు గురించా? ముందు క్లారిటీ ఇవ్వండి.

అధికారి:-
ఇందాకా రద్దయిన నోటు మీద వడా పావ్ పెట్టి ఇచ్చాడు బండి అబ్బాయి. దాంతో నోట్ల రద్దు వల్ల ప్రత్యక్షంగా వడా పావ్ కు కలిగిన ప్రయోజనాన్ని పసిగట్టగలిగాను. మీరు కూడా అలా నోట్ల రద్దులో ఉన్న పాజిటివ్ విషయాలను పట్టుకోవాలి. అందుకే వడా పావ్ తో మొదలు పెట్టాను.

విలేఖరి:-
రెండు వేల నోట్ల రద్దు ఎందుకు చేశారు సార్?

అధికారి:-
మంచి ప్రశ్న. కానీ…దేశ అంతర్గత భద్రతా పరిరక్షణ పవిత్ర కర్తవ్య దీక్ష వల్ల…దీనికి సమాధానం చెప్పలేను.

విలేఖరి:-
ఇందులో అంతర్గత, బహిర్గత కథలెందుకుంటాయి?

అధికారి:-
దేశ ప్రజలు స్కిన్ టైట్, సీ త్రూ బట్టలు వేసుకోవడం, ఒకప్పటిలా చొక్కాలకు, ప్యాంట్లకు జేబులు లేకపోవడం, ఉన్నా మరీ చిన్నవి కావడం వల్ల…పెద్ద నోట్లు క్యారీ చేయలేకపోతున్నారని…మా అంతర్గత నివేదికల్లో తేలింది. ప్రజలు మళ్లీ పెద్ద పెద్ద జేబుల బ్యాగీ ప్యాంట్లు వేసుకుంటే…అప్పుడు పెద్ద నోట్ల అవసరం గురించి ఆలోచించవచ్చు.

విలేఖరి:-
అంటే…మారే ప్రజల ఫ్యాషన్లను బట్టి నోట్లను ముద్రిస్తారా? రేపు బట్టల్లేకుండా జనం దిగంబరంగా తిరిగితే నోట్లే ముద్రించరా?

అధికారి:-
సరిగ్గా పాయింటుకు వచ్చారు. అంతేగా…అంతేగా!

(విలేఖరుల్లో కొందరికి మూర్ఛ వచ్చి కూర్చున్న కుర్చీలమీది నుండి కింద పడి కొట్టుకుంటున్నారు. వెనకాల కెమేరామ్యాన్లు రద్దయిన నోట్లను నోట్లో పెట్టుకుని నములుతున్నారు. మిగిలినవారు మిగిలిన వడా పావ్ లు పార్శిల్ కట్టించుకుని…యాభయ్యో అంతస్థు నుండి కిందికి దూకడానికి ఉద్యుక్తులవుతున్నారు…)

అధికారి:-
నోట్ల గురించి మిగిలిన వివరాలు ప్రెస్ నోట్లో ఉన్నాయి. పొరపాటున మీ కెమేరామ్యాన్లు ఆ ప్రెస్ నోట్లను కూడా నోట్లో పెట్టుకున్నారు. విషయాన్ని జీర్ణం చేసుకోవాల్సిందిగా నేను కోరిన మాటను మీరు ట్రూ స్పిరిట్లో తీసుకున్నట్లున్నారు. వెళ్లేప్పుడు నారిమన్ పాయింట్ సర్కిల్ పక్కన సందులో మాదీఫల రసాయనం బాటిళ్లు కొనుక్కుని వెళ్లండి. ఏదయినా అరిగి…కడుపులో తిప్పకుండా కాపాడుతుంది.

కెమెరామ్యాన్:-
సార్ మీకు ఆయుర్వేదం కూడా తెలుసా?

అధికారి:-
నేను ముందు బీచ్ రోడ్లో మూలికలు అమ్ముకునేవాడిని. వీధి దీపం కింద చదువుకోవడంతో అబ్రహం లింకన్ గొప్పవాడైనట్లు తెలిసి…ఎక్కడ వీధి దీపం కనపడ్డా…ఆగి చదివేవాడిని. దాంతో ఇంత పెద్దవాడినయ్యాను.

కెమెరామ్యాన్:-
మా ఖర్మ ఇలా కాలింది సార్. మాకు వీధీ లేదు. వీధి దీపమూ లేదు. అందువల్ల చదువుకుని మీలాగా గొప్పవారు కాలేకపోయాము.

అధికారి:-
ఇప్పుడు నోట్ల రద్దు గురించి మీకు స్పష్టత వచ్చింది కదా? ఇంకేమన్నా సందేహాలుంటే అడగండి…

విలేఖరులు ముక్త కంఠంతో:-
దేశ వ్యాప్తంగా తోపుడు బండ్ల వారు పొట్లాలు కట్టివ్వడానికి కాగితాలు కరువయిన నేపథ్యంలో…వారిని ఉద్ధరించడానికి పెద్ద నోట్లను రద్దు చేసి…పెద్ద మనసు చాటుకున్నట్లు…ఈ వడా పావ్ సాక్షిగా అర్థమయ్యింది సార్…బాగా అర్థమయ్యింది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్