Saturday, September 21, 2024
HomeTrending NewsBJP: పేదల ఇండ్లకు డబ్బులు ఉండవా : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

BJP: పేదల ఇండ్లకు డబ్బులు ఉండవా : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీఆర్​ఎస్​పై యుద్ధం మొదలైందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్​ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నా రు. రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు శంషాబాద్‌ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ.. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. అనంతరం అక్కడ కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్ల గురించి తెలుసుకోవడానికి వెళ్లే హక్కు కూడా కేంద్ర మంత్రిగా తనకు లేదా? అని ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్‌లో కూర్చొని అణిచివేస్తారా? అని దుయ్యబట్టారు.
‘‘ తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. రెండు పడక గదుల ఇళ్లూ వారికి ఇవ్వడం లేదు. భారాసపై మా ఉద్యమం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేసిన ఇళ్లను చూద్దామని బయలుదేరాం. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద నన్ను అడ్డుకున్నారు. పలువురు నేతలనూ అరెస్ట్ చేశారు. ఇవాళ ధర్నా, ఆందోళన కాదని చెప్పినా.. పోలీసులు మా పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. బడుగు బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుసుకోవడానికి వెళ్తే ఇలా వ్యవహరిస్తారా?

కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. 50 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత తనదేనన్నా రు. బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఖరీదైన ఇళ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనడానికి కేసీఆర్ కు డబ్బులుంటాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి డబ్బులుండవని ప్రశ్నించారు.పేదల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నా రు. అరకొరగా కట్టిన ఇండ్లు కూడా 9 ఏళ్లుగా ఎవరికి ఇవ్వ లేదన్నా రు. తొమ్మిది సంవత్సరాలైనా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని, చేతకాని ప్రభుత్వం అంటూ విమర్శించారు. కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారు కాబట్టే బీజేపీ నేతలను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
నన్ను చంపేయండి..నేను ఇంటికి మాత్రం వెళ్ళను
అంతకు ముందు ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ఎయిర్​పోర్ట్​కు చేరుకోగానే.. పోలీసులు బాటసింగారంలోని డబుల్​ ఇండ్లను పరిశీలించేందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కాగా భారీ వర్షంలోనూ కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి శంషాబాద్​ ఔటర్ రింగ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  75 ఏళ్ల భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారని, పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. కేసీఆర్ తొత్తుల్లాగా కాకుండా ప్రజాసేవకుల్లా పోలీసులు వ్యవహరించాలన్నారు. కేంద్రమంత్రి కాన్వాయ్ కు డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్