కథలో హాస్యం ఒక భాగమైనప్పుడు దానిని నడిపించడం కాస్త తేలికగానే ఉంటుంది. కానీ హాస్యాన్నే ప్రధానంగా చేసుకుని కథను అల్లుకోవలసి వచ్చినప్పుడు అది చాలా కష్టమైనపనే అవుతుంది. ఎందుకంటే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమనేది అంత తేలికైన విషయమేం కాదు. అలాంటి ఒక సాహసానికి సిద్ధపడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా ‘చారి 111’ కనిపిస్తుంది. నిన్ననే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది.
వెన్నెల కిశోర్ హీరోగా కీర్తి కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రధానమైన కథ అంతా కూడా వెన్నెల కిశోర్ చుట్టూనే తిరుగుతుంది. వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయితే ఆయనకి తగిన కామెడీ సీన్స్ ను రాసుకోవడం పైనే ఆడియన్స్ ఆశించే ఎంటర్టైన్ మెంట్ ఆధారపడి ఉంటుంది. అలాంటి కంటెంట్ ను అందించడంలో ఈ సినిమా టీమ్ కొంతవరకూ మాత్రమే సక్సెస్ అయిందని చెప్పాలి.
సీక్రెట్ ఏజెంటు చారీగా .. వెన్నెల కిశోర్ చుట్టూ కథను అల్లుకోవాలనే ఆలోచన సరైనదే. అయితే అందుకు సంబందించిన కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. స్క్రీన్ టైమ్ చాలా విలువైనది కావడం వలన, ప్రతి సీన్ విషయంలో కేర్ తీసుకోవాలి. కానీ ఈ సినిమా చూస్తే అలాంటి కసరత్తు తగ్గిందనే అనిపిస్తుంది. సిల్లీ సీన్స్ .. లూజ్ సీన్స్ లేకుండా చూసుకుంటూ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండేలా జాగ్రత్తపడితే, ఈ సినిమా మరిన్ని నవ్వులు పూయించేదేమో.