Friday, November 22, 2024
HomeTrending Newsఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు...విశ్లేషణ

ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు…విశ్లేషణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మళ్ళీ సోమవారం(జనవరి-15) నోటీసులు జారీ చేసింది. ఎప్పటిమాదిరిగానే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ దఫా ఏం జరుగనుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవితను అరెస్టు చేస్తారా? చేయారా? అనే అంశాలపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోటీసులు జారీ చేయటంలో పరమార్థం ఏమిటో రాజకీయ పార్టీలకు  అంతుపట్టడం లేదు. రాజకీయ ప్రేరేపితేమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కవితను అరెస్టు చేస్తారని బలమైన వాదనలు జరుగుతున్నాయి.

అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టేనని అంటున్నారు. బిజెపి, బీఆర్ఎస్  పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమే కవితను అరెస్టు చేయకపోవటం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకు పోతుందని…కాంగ్రెస్ జెండా రెపరెప లాడుతుందని హస్తం నేతల అంచనాగా ఉంది.

ఇంత చిన్న లాజిక్ తెలియకుండా బిజెపి పాచిక వేయదని… అదే జరిగితే రాజకీయ వైకుంఠపాళిలో  అదోగతికి చేరుకుంటుందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో మూడో దఫా అధికారంలోకి వచ్చేందుకు ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు ఫోకస్ పెట్టారు. అరెస్టు అంశంలో తేడాలు వస్తే పార్టీ బలపడేందుకు అవకాశం ఉన్న తెలంగాణలో కమలం వాడిపోతుందనటంలో సందేహం లేదు. ఉన్న నాలుగు సీట్లు గల్లంతవుతాయని రాష్ట్ర బిజెపి నేతలకు గుబులు పట్టుకుంది.

ఇక బీఆర్ఎస్ పరిస్థితి మరో రకంగా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన నాయకత్వానికి పాలుపోని స్థితి ఎదురవుతోంది. అరెస్టు జరిగితే పార్టీ అధినేత కుమార్తె జైలుకు వెళ్ళటం అవమానకరంగా ఉంటుంది. పార్టీ ప్రతిష్ట ప్రజల్లో పలుచన అవుతుంది. అరెస్టుకాకపోతే అందరు గుసగుసలు పెడుతున్నట్టుగా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని ఊరంతా కోడై కూస్తుంది కాంగ్రెస్.

2019 లోక్ సభ ఎన్నికల్లో హిందువులకు వ్యతిరేకంగా కెసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని…ప్రచారం ఉదృతంగా జరిగి కమలం వికసించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్,సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో…ముఖ్యంగా మొదటి మూడు స్థానాల్లో గ్రామీణ ఓటర్లు కూడా కారు గుర్తును తిరస్కరించారు.

అప్పుడు బిజెపికి మేలు చేసేందుకే కెసిఆర్ అలా అన్నారని రాజనీతిజ్ఞులు అంటుంటారు. 2019లో ఎంపి సీటు కోల్పోయిన కవిత తాజా పరిణామాలతో ఎన్నికల్లో పోటీ చేయకుండా మిన్నకుండే పరిస్థితి ఉత్పన్నం అయింది. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఎంతో ఈడి విచారణలో తేలుతుంది. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక….రాజకీయంగా కవితకు, కెసిఆర్, గులాబీ దళానికి గడ్డు రోజులు.

ఏం జరిగినా మన మంచికేనని కాంగ్రెస్ వేచి చూస్తోంది. అరెస్టు చేస్తే అవినీతి భాగోతం అని ప్రచారం…లేదంటే రెండు పార్టీలు ఒకటే అని ప్రజల్లోకి వెళ్ళటం… ఆ విధంగా హస్తానికి రెండు వైపులా పదును ఉండనుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్