ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేసిన ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు పేరును జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా…బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బలపరిచారు.
రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన సాగించాల్సిన అవసరం ఉందని, అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో విజయం దేశానికే స్పూర్తిగా నిలిచిందని, మొన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన ఎన్డీయే మీటింగ్ లో వివిధ రాష్ట్రాల నేతలు దీనిపై చర్చించారని…కూటమి అంటే ఎలా పని చేయాలో ఏపీలో ఎన్డీయే కూటమి నిరూపించిందని పవన్ వివరించారు. ఐదేళ్లుగా రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉందని… సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదన్నారు.
ప్రజాహితం, రాగ ద్వేషాలకు అతీతంగా పని చేయడమే తనకు తెలుసనీ, అలాగే తన పరిపాలన ఉందబోతోందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు భరోసా ఇచ్చారు. తన అనుభవంతో, అందరి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి అనునిత్యం పని చేద్దామని ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చారు. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలూ నూటికి నూరు శాతం కలిసికట్టుగా పని చేశారని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని భావోద్వేగంతో వెల్లడించారు. 175 సీట్లలో పోటీ చేసి 164 సీట్లు సాధించామని.. 93 శాతం స్ట్రైకింగ్ రేట్ సాధించామని, దేశ చరిత్రలో ఇది ఓ అరుదైన సంఘటన అని అభివర్ణించారు. గతంలో ఎన్నోసార్లు విజయం సాధించినా ఈసారి ఉన్నంత సంతృప్తి ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన విజయంతో ఢిల్లీలో మా అందరి గౌరవం పెరిగిందన్నారు.
పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ ఫర్ మీద మొదట్లో కొన్ని అనుమానాలు ఉన్నా క్రమంగా అది సర్దుకొని సంపూర్ణంగా బదిలీ అయ్యిందని, అందుకే ఇంతటి ఘన విజయం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ.. అన్ని పార్టీల అభ్యర్దులూ మనసుపెట్టి పనిచేశారని అభినందించారు. తనను ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
జగన్ పాలనపై పరోక్షంగా స్పందిస్తూ… ఏ అహంకారంతో విర్రవీగారో అది కూలిపోయిందని, పదవి వచ్చిందని విర్రవీగి.. రేపు అనేది లేకుండా ఉంటుందని అనుకుంటే అందరికీ అదే జరుగుతుందని…. ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా దీన్ని ఒక కే-స్టడీగా తీసుకోవాలని హితవు పలికారు. బూతులు మాట్లాడే నేతలను, అరాచక శక్తులను, అవినీతిపరులను ఇప్పటిదాకా చూశారని… పాలకులు అంటే ఎలా ఉండకూడదో గత ఐదేళ్లూ చూశారని.. అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారని… మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలని చూస్తే మనకూ అదే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. అయితే తప్పు చేసినవారిని వదిలే ప్రసక్తే లేదని, వారికి చట్టపరంగా శిక్షపడేలా చూస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభను ఓ గౌరవసభగా తీర్చిదిద్ది అర్ధవంతమైన చర్చలు జరిగేలా చేస్తామన్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖ ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని, కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని… రాష్ట్రంలో అరాచకం, అశాంతికి చోటులేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.