No Power: అధికారం లేకుండా బీసీలు ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తే మాత్రం ఏమి ప్రయోజనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిస్తే బీసీలకు కేవలం పది మాత్రమే ఇచ్చారని, కానీ తాము 103 సీట్లు గెలిస్తే 9 మంత్రి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లకు అప్పగించారని మండిపడ్డారు. చెంచాగాళ్ళకు, నోరులేని అమాయకులకు మంత్రిపదవులు ఇస్తే ఉపయోగం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ, బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టిడిపి హయాంలో బీసీలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన శాఖలు అప్పగించి తామంతా నాయకులుగా సొంతంగా ఎదగడానికి చంద్రబాబు ప్రోత్సహించారని చెప్పారు. కానీ ఇప్పుడు సిఎం జగన్ మాత్రం అలంకారప్రాయంగా పదవులు ఇచ్చి అధికారం అంతా వారిదగ్గరే పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలంటే వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ చిన్న చూపేనని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు కార్పోరేషన్లు పెట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు నిధులు కేటాయించామని, ఎన్నికల సంవత్సరంలో ఆయా కార్పొరేషనల్లో ఖర్చు కాకుండా మిగిలి ఉన్న నిధులను వెనక్కు తీసుకుని సిఎం జగన్ ను బీసీలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మూడేళ్ళలో బీసీలకు ఏమి మేలు చేశారో చర్చకు రావాలని, ఎక్కడైనా ఎలాంటి చర్చకైనా తాని సిద్ధమని సవాల్ చేశారు.
Also Read : కొలువు తీరిన కొత్త మంత్రివర్గం