Friday, March 13, 2026
HomeTrending Newsహైదరాబాద్లో నర్సరీ మేళా

హైదరాబాద్లో నర్సరీ మేళా

గ్రీన్ టాక్స్ పెట్టి ప్రకృతి వనాల పెంపకానికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. అడవులను పునరుజ్జీవం చేసేందుకు… ఈ నెల 21న భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో 12వ గ్రాండ్‌ నర్సరీ మేళాను గురువారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. ఈ నెల 22 వరకు నర్సరీ మేళా కొనసాగనుండగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 140పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేళాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నగర వాసులకు ఇదో మంచి అవకాశమని, హోంగార్డెన్‌, టెర్రస్‌ గార్డెన్‌, వర్టికల్‌ గార్డెన్‌, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి వేదిక అన్నారు. నర్సరీలతో మేలు జాతి మొక్కలు, అంటుకట్టిన మొక్కలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి నర్సరీలతో నగరాలు, పట్టణాలలో మిద్దెతోటల సాగు పెరుగుతుందన్నారు. దీనితో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించినట్లవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నర్సరీలను ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో నర్సరీలు అంటే ఎవరికి తెలిసేవి కాదు అనేక మేలు జాతి మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నియోజక వర్గానికి కూడా నర్సరీ ఉండేది కాదని, గత ప్రభుత్వాల హయాంలో ఒక మొక్క నాటి ఫొటోలు దిగేవారన్నారు.

సీఎం కేసీఆర్ ఆలోచనతో తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరిట నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  దేశంలో ఇంత మొత్తంలో ఎక్కడా జరగటం లేదని, రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచుకునే లక్ష్యంతో హరితహారం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతానికి పచ్చదనం 7.6 శాతం పెరిగి 31.6 శాతానికి చేరిందని.. ఇవి కేంద్రం చెప్పిన లెక్కలన్నారు.

పిల్లల జన్మదినం రోజున మొక్కలు నాటాలని.. పిల్లలతో కలిసి మొక్కలను పెంచాలన్నారు. పచ్చదనం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చక్కటి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందేందుకు ఇంట్లో మొక్కలు పెంచుకోవాలన్నారు. పిల్లలకు మనమేమిచ్చినా ఇవ్వకపోయినా.. మంచి వాతావరణం, మంచి ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

 

Also Read: కేంద్ర మంత్రులది పూటకో మాట – మంత్రి హరీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular