రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో ఈ సంవత్సరం చేప పిల్లల పంపిణీ కి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ లాంచనంగా ప్రారంభిస్తారు.
అదేరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో చేప పిల్లల పంపిణీ ని ప్రారంభించాలని, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, MLC లు, MLA లు, ZP చైర్మన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. మొదటి సారి రాష్ట్రంలోని 3939 నీటి వనరులలో 27.86 కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. ఈ సంవత్సరం 26,357 నీటి వనరులలో 84.13 కోట్ల రూపాయల ఖర్చుతో 85.60 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మత్స్యకారులకు అదనపు ఆదాయవనరుగా మారాలనే ఉద్దేశంతో రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సంవత్సరం 300 నీటి వనరులలో 25.99 కోట్ల రూపాయల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ఆవిర్బావ సమయంలో రాష్ట్రంలో 1.98 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో మత్స్యసంపద ఉత్పత్తి 4.24 లక్షల టన్నులకు పెరిగిందని, మత్స్యకారుల ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడి ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీతో రాష్ట్రంలోని 3.76 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది.