తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఓ పెద్ద డ్రామాగా తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అభివర్ణించారు. హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులు కాపాడుకునేందుకు కేసిఆర్ తో కలిసి జగన్ నాటకాలాడుతున్నారని అయన విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఇద్దరు నేతలూ పాకులాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎన్నికలకు ముందు, తరువాత ఇద్దరూ సహకరించుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణా ప్రజలను కెసియార్, ఏపీ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని, ఇద్దరూ తోడు దొంగలేనని కేశినేని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో తన చెల్లిని జగన్ ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు.
రాజథాని నిర్మాణాలను గాలికోదిలేసిన జగన్ కరకట్ట అభివృద్ధికి శంఖుస్థాపన చేశారని, చిత్తశుద్ది ఉంటె రాజధాని ప్రాంతంలో చేపాటిన అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని నాని సూచించారు. తెలుగుదేశం హయాంలో విజయవాడ అభివృద్ధికి ఐదేళ్ళలో 10 వేల కోట్లు ఖర్చు చేశామని, రెండేళ్లుగా విజయవాడలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు సొంత ప్రయోజనాలు మానుకొని ప్రజలకోసం పనిచేయాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి ఆదరించిన ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని కేశినేని అన్నారు.